
Harmanpreet Kaur: మిథాలీ రాజ్ రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్
ఈ వార్తాకథనం ఏంటి
జులై 9న మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఈ మ్యాచ్ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఎంతో గుర్తుండిపోయేరోజుగా నిలిచింది. ఈ విజయంతో ఆమె, మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల రికార్డును సమం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, మిథాలీ రాజ్ సరసన నిలిచింది. ఇక మరో మ్యాచ్ ఆడితే, అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత మహిళా క్రికెటర్‌గా కొత్త చరిత్రను లిఖించనుంది. 36 ఏళ్ల హర్మన్‌ప్రీత్ 2009 మార్చి 7న అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
వివరాలు
బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానంగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్
ఆల్‌రౌండర్‌గా హర్మన్‌ప్రీత్ భారత క్రికెట్‌కు కీలకంగా సేవలందిస్తోంది. ఆమె బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానంగా రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు టెస్టుల్లో ఆమె 200 పరుగులు చేసింది, అత్యధిక వ్యక్తిగత స్కోరు 69గా ఉంది. టెస్టుల్లో ఆమె 12 వికెట్లు కూడా తీసింది. వన్డే క్రికెట్‌లో ఆమె 146 మ్యాచ్‌లు ఆడి, 3943 పరుగులు చేసింది. ఈ పరుగుల్లో ఆరు శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో ఆమె అత్యధిక స్కోరు 171 నాటౌట్. బౌలింగ్ పరంగా వన్డేల్లో 31 వికెట్లు పడగొట్టింది. ఇక టీ20 ఫార్మాట్‌లో 181 మ్యాచ్‌లు ఆడి, ఆమె 3639 పరుగులు చేసింది. ఇందులో ఒక శతకం, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 32 వికెట్లు తీసింది.
వివరాలు
4 ఓవర్లలో కేవలం 15 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన రాధా యాదవ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో ఏడుగురు వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్ సోఫీ డంక్లీ 19 బంతుల్లో 22 పరుగులతో జట్టుకు అత్యధిక స్కోరు అందించింది. భారత బౌలింగ్‌లో రాధా యాదవ్ తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇవ్వడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. శ్రేయాంక పాటిల్ కూడా రెండు వికెట్లు తీసి బౌలింగ్ విభాగంలో మెరిశారు.
వివరాలు
ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 3-1 ఆధిక్యంలో..
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, ఓపెనర్లు స్మృతి మంధాన (32), షెఫాలీ వర్మ (31)లతో శుభారంభం అందుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 25 బంతుల్లో 26 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 24 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు దిశగా నడిపించింది. మొత్తం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి, మూడోవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. జూలై 12న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే ఐదవ టీ20 మ్యాచ్ ఇప్పుడు లాంఛనప్రాయంగా మారింది. అనంతరం రెండు జట్లు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతాయి, ఇందులో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.