ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. టాప్-3కి చేరువగా స్మృతీ మంధాన
మహిళల ఐసీసీ వన్డే ర్యాంకులు విడుదలయ్యాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ స్థానాలు, పాయింట్లను మెరుగుపర్చుకోవడం విశేషం. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (654 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకును సాధించింది. న్యూజిలాండ్‌పై వన్డే సెంచరీ చేసిన స్మృతీ మంధాన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగింది. ప్రస్తుతం మంధాన (728 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఆమె పాయింట్లు 703 నుండి 728కి పెరిగాయి, తద్వారా టాప్-3 ర్యాంకుకు చేరువగా వచ్చింది. లారా వాల్వార్డ్‌ట్ (756), నాట్ స్కివెర్ బ్రంట్ (760), చమరి ఆటపట్టు (733) వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
టాప్-100లోకి
ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (538 పాయింట్లు) భారత తరఫున టాప్-20లో నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని 19వ స్థానంలో ఉంది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ రెండో ర్యాంకులో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె 703 పాయింట్లు సాధించింది, ర్యాంకులో మార్పు లేకపోయినా, పాయింట్ల విషయంలో కాస్త పురోగతి చూపించింది. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (770 పాయింట్లు) బౌలింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. భారత యువ బౌలర్ ప్రియా మిశ్రా ఏకంగా 77 స్థానాలను మెరుగుపర్చుకొని తొలిసారి టాప్-100లోకి ప్రవేశించింది. ఆమె ప్రస్తుతం 271 పాయింట్లతో 83వ స్థానంలో ఉంది.
ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ
రేణుకా సింగ్ (424 పాయింట్లు) కూడా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని 32వ ర్యాంకును సాధించింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక్కరే భారత్ నుంచి టాప్-10లో ఉంది, 378 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా క్రీడాకారిణి మరిజన్నె కాప్ (404 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది.