Harry Brook Apology: నైట్‌క్లబ్ ఘటనపై హ్యారీ బ్రూక్ క్షమాపణలు.. భారీ ఫైన్‌తో ఈసీబీ ఫైనల్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడికి 'ఫైనల్ వార్నింగ్' జారీ చేస్తూ, 30,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.36.29 లక్షలు) జరిమానాగా విధించింది. మద్యం మత్తులో ఓ నైట్‌క్లబ్ వద్ద గొడవకు దిగడమే ఈ చర్యలకు కారణం. 2025 నవంబర్ 1న ఈ సంఘటన జరగ్గా, విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వ్యవహారం బ్రూక్ నుంచి ఇదే మొదటిసారి కాకపోవడంతోనే ఈసీబీ కఠినంగా స్పందించి ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Details
బ్రూక్‌కు రూ.36.29 లక్షల జరిమానా
వివరాల్లోకి వెళ్తే... వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మూడో వన్డేకు ముందు హ్యారీ బ్రూక్ తన సహచర క్రికెటర్లతో కలిసి ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. మద్యం సేవించి ఉన్నాడన్న అనుమానంతో అక్కడి బౌన్సర్‌లు బ్రూక్‌ను లోపలికి అనుమతించలేదు. దీంతో నైట్‌క్లబ్ ప్రవేశం నిరాకరించడంపై బౌన్సర్‌తో బ్రూక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో బౌన్సర్ బ్రూక్‌పై చేయిచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం బ్రూక్ స్వయంగా జట్టు మేనేజ్‌మెంట్‌కు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈసీబీ... బ్రూక్‌కు రూ.36.29 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Details
భవిష్యత్తులో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను
తన దురుసు ప్రవర్తనపై బ్రూక్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ సందర్భంగా హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. 'నా ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. నా చర్యలు తప్పని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ ఘటన వల్ల నేను మాత్రమే కాదు, ఇంగ్లండ్ జట్టు కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం. ఆ బాధ్యతను నేను ఎంతో సీరియస్‌గా తీసుకుంటాను. సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులను నిరాశపరిచినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నాడు.
Details
హ్యారీ బ్రూక్ తన తప్పును తెలుసుకున్నాడు
ఇక ఈసీబీ ప్రతినిధి మాట్లాడుతూ.. 'ఈ ఘటనపై మాకు పూర్తి సమాచారం ఉంది. పరిస్థితిని సున్నితంగా పరిష్కరించాం. అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. హ్యారీ బ్రూక్ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పాడని తెలిపారు. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ ముగిసిన అనంతరం బ్రూక్ శుక్రవారం స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అనంతరం జనవరి 19న శ్రీలంక పర్యటనకు ఇంగ్లండ్ జట్టు బయలుదేరనుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.