Harry Brook: ప్రపంచంలో ఉత్తమ ఆటగాడు ఎవరో చెప్పిన జో రూట్
ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్ 4లో భాగమైన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు ఎవరో చెప్పాడు. భారత యువ ఆటగాళ్లైన యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లలలో రూట్ ఒక్కరిని కూడా అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించలేదు. అతను తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను అత్యుత్తమ ఆటగాడిగా పేర్కొన్నాడు. అతను ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడని ప్రశంసించాడు. 25 ఏళ్ల హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. 2022లో క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన అతను 23 మ్యాచ్‌ల్లో 8 శతకాలు సాధించడం విశేషంగా చెప్పవచ్చు.
323 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించిన ఇంగ్లాండ్
ప్రస్తుతం అతను చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. రూట్ బ్రూక్ గురించి మాట్లాడుతూ,"ప్రస్తుతానికి హ్యారీ బ్రూక్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. అతను ఒత్తిడిని తట్టుకుని ఆడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడుతూ, సిక్స్ కోసం తల మీదుగా స్కూప్ షాట్ అద్భుతంగా ఆడతాడు,"అని పేర్కొన్నాడు. హ్యారీ బ్రూక్ ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గొప్ప ప్రదర్శన ఇచ్చాడు. మొదటి టెస్టులో అతను 171 పరుగులు చేసి,జట్టు 8 వికెట్లతో విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్టులో, మొదటి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేసి మరో శతకం సాధించిన బ్రూక్, రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేశాడు, దీంతో ఇంగ్లాండ్ 323 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
సూపర్ ఫామ్‌లో జో రూట్
ప్రస్తుతం, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్రూక్ 854 పాయింట్లతో అగ్రస్థానానికి చేరువగా ఉన్నాడు, జో రూట్ 895 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. బ్రూక్ 23 టెస్టుల్లో 2280 పరుగులు చేసి 61.62 సగటుతో ఆడుతున్నాడు. ప్రస్తుత క్రికెట్ ఫ్యాబ్ 4లో విరాట్ కోహ్లీ,కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ అని పేర్కొంటున్నారు. జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు, పలు రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 12,886 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్న రూట్, మరొక 492 పరుగులు చేస్తే పాంటింగ్ (13,378), కలిస్ (13,289), ద్రవిడ్ (13,288)లను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటాడు. సచిన్ (15,921 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.