
HCA Scam Case : హెచ్‌సీఏ అవకతవకల కేసు.. దేవరాజ్ రామచందర్ కోసం సీఐడీ సెర్చ్ ఆపరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకల కేసు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామచందర్ నివాసంలో సీఐడీ అధికారులు బుధవారం తెల్లవారుజామున నుంచే సోదాలు ప్రారంభించారు. నేరేడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలోని ఆయన నివాసంతో పాటు, ఆయన ఆఫీసులపై కూడా దాడులు నిర్వహించారు. కేసు నమోదు అయినప్పటి నుంచే దేవరాజ్ తన ఫోన్లను స్విచ్‌ఆఫ్ చేసి, పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఆయన పారిపోవడంలో కొంతమంది సహకరించినట్లు అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Details
దేశం విడిచిపోకుండా అన్ని ఎయిర్ పోర్టులో భద్రత
ఈ నేపథ్యంలో దేవరాజ్‌పై లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేయగా, దేశం విడిచి వెళ్లకుండా అన్ని ఎయిర్‌పోర్టులు, సముద్ర నౌకాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఆయనను పట్టుకోవడం కోసం సీఐడీ రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నికలో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి నమోదైన ఈ కేసులో మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే దేవరాజ్ మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు హెచ్‌సీఏలోని మరికొందరు అనుమానితులపై కూడా సీఐడీ నిఘా పెంచింది.