హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు
ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(79), విరాట్ కోహ్లీ(61), గ్లెన్ మాక్స్‌వెల్ (59) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. స్టోయినిస్ (65) నికోలస్ పూర్ 62 పరుగులతో విజృంభించారు. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ల సంబరాలు మిన్నింటాయి. క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్ చర్యల పట్ల ప్రస్తుతం వివాదం చెలరేగింది.
అవేశ్ ఖాన్‌కు మందలింపు
చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా.. క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్ బంతిని టచ్ చేయలేకపోయాడు. అయితే లెగ్ బై రూపంలో ఒక పరుగు తీశాడు. దీంతో లక్నో విజయం సాధించడంతో అవేశ్ ఖాన్ దూకుడుగా ప్రవర్తించాడు. ఏకంగా హెల్మెట్ నేలకేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా అతనిపై ఫైర్ అయ్యారు. అవేశ్ ఖాన్ ఐపీఎల్ లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సెక్షన్ 2.2 కింద ఐపీఎల్ నిర్వాహకులు మందలించారు.