నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో
బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం బౌండరీల మోతతో దద్దరిల్లింది. సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూర్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోత మోగించారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బెంగళూర్ భారీ స్కోరు చేసింది. ఈ స్కోరును ఛేదించడానికి దిగిన లక్నో జట్టుకు శుభారంభం దక్కలేదు. విధ్వంసకర బ్యాటర్ కేల్ మైయర్స్(0) డకౌట్ తో నిరాశపరిచాడు. దీపక్ హుడా(9), కృనాల్ పాండ్యా(0) వెంట వెంటనే ఔట్ కావడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది.
15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నికోలస్ పూరన్
23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో జట్టుకు గెలుపు అవకాశాలు పూర్తిగా క్షీణించాయి. ఐదో స్థానంలో క్రీజులోకి స్టోయినిస్ బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 30 బంతుల్లో 65 పరుగులు చేసి గెలుపు అవకాశాలను రేకత్తించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. 19 బంతుల్లో (7 సిక్సర్లు, 4 ఫోర్లు) 62 పరుగులు చేసి విజృంభించాడు. చివర్లో బదోని 24 బంతుల్లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. చివర్లో బెంగళూరు బౌలర్లు కట్టడి చేసినా.. లక్నో 212 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.