APL: అమరావతిలో ఏపీఎల్ తుది దశకు ఏర్పాట్లు పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ తుది దశకు చేరుకుంది. తొలి విడత పోటీలు విశాఖపట్నంలో, రెండో విడత మ్యాచ్‌లు కడపలో విజయవంతంగా నిర్వహించిన అనంతరం, ఇప్పుడు చివరి దశ పోటీలకు అమరావతి వేదికగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇందుకోసం అమరావతిలోని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియాన్ని అన్ని సౌకర్యాలతో సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో తుది దశ పోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
వివరాలు
ముఖ్య అతిథిగా రామ్ చరణ్..
తుది దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టోర్నీలో మిగిలిన మొత్తం 12 మ్యాచ్‌లు అమరావతిలోనే నిర్వహించనున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం, సాయంత్రం రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ఈ నెల 27న ముగియనుండగా, అనంతరం మరుసటి రోజు నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఏడుజట్లలో భీమవరం బుల్స్ ప్రస్తుతం అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది పాయింట్లు సాధించింది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్ దశకు అర్హత పొందుతాయి.