LOADING...
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం
టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో 2007 నుంచి 2024 వరకు టీమిండియా ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
09:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఎమోషన్‌. 2007ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కొత్త కుర్రాళ్లు, జుట్టు గుబురుగా ఉన్న ఓ యువ కెప్టెన్ ఎంఎస్ ధోని, హైప్‌ అయితే అస్సలు లేదు. కానీ దక్షిణాఫ్రికాలో ఒక్కసారిగా టీమిండియా ఆట మార్చేసింది. పాకిస్థాన్‌తో తొలి బౌల్‌ అవుట్‌ విజయం... అది అసలు క్రికెట్‌లోనే వేరే లెవల్‌ సీన్‌. యువరాజ్ సింగ్ ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం అయితే అభిమానులను పిచ్చెక్కించింది. జోహన్నెస్‌బర్గ్‌లో జోగిందర్ శర్మ వేసిన ఆ చివరి బంతితో భారత్ వరల్డ్‌కప్ గెలిచింది. అది కేవలం ట్రోఫీ కాదు... భారత క్రికెట్ దిశనే మార్చేసిన ఘట్టం.

వివరాలు 

2009,2010 టోర్నీల్లో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా

కానీ ఆ తర్వాత కాలం అంత సాఫీగా సాగలేదు. 2009, 2010 టోర్నీల్లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లో కష్టమైన పిచ్‌లపై మన జట్టు ఆట సరిగా లేదు. సూపర్‌-8 దశలో ఒక్క విజయం కూడా రాలేదు. పాత ఆటగాళ్లను, కొత్త టీ20 స్టైల్‌ను కలపలేక జట్టు తడబడినట్టు స్పష్టంగా కనిపించింది. 2012లో శ్రీలంకలో జరిగిన వరల్డ్‌కప్‌లో మాత్రం భారత్ గట్టిగానే కనిపించింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచింది. పాకిస్థాన్‌పై ఘన విజయం కూడా అందుకుంది. కానీ నెట్ రన్‌రేట్ రూపంలో విధి వక్రించింది. ఆట బాగున్నా, లెక్కలు కలిసి రాక టోర్నీ నుంచి బయటపడాల్సి వచ్చింది.

వివరాలు 

2014లో మరోసారి నిరాశ

ఈసారి 2014లో మరోసారి నిరాశ ఎదురైంది.బంగ్లాదేశ్‌లో జరిగిన ఆ ఎడిషన్‌లో భారత్ ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఈసారి ట్రోఫీ భారత్‌కే వస్తుందన్న భావన అభిమానుల్లో నిండుగా ఉంది.కానీ ఫైనల్‌లో శ్రీలంక బౌలర్ల ముందు భారత బ్యాటింగ్ తడబడింది. 20ఓవర్లలో చేసిన 130పరుగులు ఏమాత్రం చాలలేదు. లంక జట్టు సులువుగా ఛేజ్ చేసి కప్ కొట్టేసింది.మళ్లీ ఓసారి దగ్గరికి వచ్చి దూరమైంది. 2016లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్‌ కొత్త ఆశలు రేపింది. బంగ్లాదేశ్‌పై చివరి ఓవర్ థ్రిల్లర్, ఆస్ట్రేలియాపై కోహ్లీ చేసిన పర్ఫెక్ట్ చేజ్... అన్నీ మరిచిపోలేని క్షణాలే. కానీ వాంఖడేలో జరిగిన సెమీఫైనల్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ విజృంభించారు.

Advertisement

వివరాలు 

2021 చీకటి అధ్యాయం

లెండల్ సిమన్స్, ఆండ్రే రస్సెల్ విధ్వంసకర బ్యాటింగ్‌కు వాంఖడే స్టేడియం నిశ్శబ్దంలో మునిగింది. ఆ పరాజయంతో భారత్ వరల్డ్‌కప్ ప్రయాణం అక్కడితో ఆగిపోయింది. 2021 అయితే నిజంగా చీకటి అధ్యాయం. కోవిడ్ తర్వాత దుబాయ్‌లో జరిగిన టోర్నీలో పాకిస్థాన్ చేతిలో వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి భారత్ ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో మరో పరాజయం. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఇది శాస్త్రి-కోహ్లీ యుగానికి ముగింపు పలికింది. 2022లో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో భారత్ ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన ఆశించింది. "ఎంసీజీలో పాకిస్థాన్‌పై కోహ్లీ కొట్టిన ఆ ఆరు సిక్సర్లు, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

Advertisement

వివరాలు 

2022లో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి 

కానీ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ భారత బౌలర్లను చీల్చిచెండింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేజ్ చేసింది. 10 వికెట్లతో ఓటమి... అది టీ20 క్రికెట్‌పై భారత ఆలోచనలనే మార్చేలా చేసింది. అంతిమంగా 2024. తొలి టైటిల్‌కు 17 ఏళ్ల తర్వాత భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. బార్బడోస్‌లో జరిగిన ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చాంపియన్‌గా నిలిచింది.

వివరాలు 

2024 ఫైనల్‌లో ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు 

ఫైనల్‌లో దక్షిణాఫ్రికాకు చివరి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. కప్ చేజారిపోతుందనిపించిన క్షణంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఆటను తిప్పేశారు. సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్న ఆ క్యాచ్ అయితే ఏళ్ల తరబడి రీప్లే అవుతూనే ఉంటుంది. భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయాలకు వీడ్కోలు పలకడం ఈ కథకు పూర్తిస్థాయి ముగింపు అనిపించింది. భారత క్రికెట్ మళ్లీ తన గౌరవాన్ని, గర్వాన్ని తిరిగి సంపాదించింది.

Advertisement