Harmanpreet: హర్మన్‌ప్రీత్ క్యాచ్‌తో చరిత్ర.. గావస్కర్ 1983 జ్ఞాపకాలు మళ్లీ మదిలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన దేశవ్యాప్తంగా సంబరాలను రేపింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి ఎగర వేయగా, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆ క్యాచ్‌ను అందిపుచ్చుకుంది. ఆ క్షణమే భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ బంతిని జేబులో పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ ఆ క్షణం క్రికెట్ అభిమానులకు 1983లో భారత పురుషుల జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు సునీల్ గావస్కర్ చేసిన ఘట్టాన్ని గుర్తు చేసింది.
Details
బాల్ జేబులో పెట్టుకొని సంబరాలు
అప్పట్లో లార్డ్స్‌లో జరిగిన భారత్ తొలి ప్రపంచ కప్ విజయం సందర్భంగా గావస్కర్ కూడా మ్యాచ్ బాల్‌ను ఇలాగే జేబులో పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ అదే తరహాలో ప్రవర్తించడం క్రీడాభిమానుల హృదయాలను తాకింది. మ్యాచ్ అనంతరం ఈ దృశ్యంపై స్పందించిన గావస్కర్ మాట్లాడుతూ హర్మన్‌ప్రీత్ లాస్ట్ క్యాచ్ పట్టిన తర్వాత ఏమి చేసిందో చూశారా? 1983లో ఎవరో చేసినట్లుగానే ఆమె బంతిని తన జేబులో వేసుకుంది. ఆ బాల్ ఇప్పుడు ఆమె జీవితంలో అమూల్యమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఆమె నుంచి కేవలం జట్టు సభ్యులు మాత్రమే కాకుండా ప్రత్యర్థి క్రికెటర్లు కూడా ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారని ప్రశంసించారు.
Details
పంాబీలో ఇంటర్వ్యూ
ఇక మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ తన మాతృభాష పంజాబీలో ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రాతో మాట్లాడుతూ ఆమె, ముందుగా ఈ విజయాన్ని భగవంతుడికి అంకితం చేస్తున్నాను. ఇది భారత మహిళల ఎన్నో ఏళ్ల కృషి, పోరాటానికి ప్రతీక. ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ అనుభవాలే జట్టును మరింత బలంగా, ఐక్యంగా తీర్చిదిద్దాయని చెప్పింది. తన జట్టులో ఇంత ప్రతిభావంతమైన క్రీడాకారిణులు ఉన్నప్పటికీ భారత్ అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఎందుకు విజయం సాధించలేకపోయిందో తరచూ తనను తాను ప్రశ్నించుకున్నానని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. ఇక ఇప్పుడు ఆ ప్రశ్నకు జవాబు దొరికిందంటూ ఆమె చిరునవ్వు చిందించింది