క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన హెచ్.ఎస్.ప్రణయ్
భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి సత్తా చాటాడు. తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో అద్భుతంగా రాణించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో మూడో సీడ్ ప్రణయ్ 21-9, 21-17తో టామి సుగియార్తో(ఇండినేషియా)పై గెలుపొందాడు. కేవలం 36 నిమిషాల్లోనే సుగియార్తో ను ప్రణయ్ మట్టికరిపించాడు. గత నెలలో మలేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన ఇండియన్ ప్లేయర్ ప్రణయ్ అదే ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం సుగియార్తోపై ప్రణయ్ గెలుపోటముల రికార్డును 3-0 కు పెంచుకున్నాడు.
లాంగ్ ఆగ్నస్‌తో పోటీపడనున్న ప్రణయ్
ఇక శుక్రవారం జరిగే క్వార్టర్స్ పోరులో అయిదో సీడ్ లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్)తో ప్రణయ్ పోటీపడనున్నాడు. మరో మ్యాచులో పారుపల్లి కశ్యప్ 16-21, 17-21తో లీ యాంగ్ (చైనీస్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో తాన్య హేమంత్ 11-21, 6-21తో టాప్ సీడ్ తైజుయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్ లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి జోడీ 13-21, 18-21తో సియాంగ్-లిణ్ షావో (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది.