LOADING...
#NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా?

#NewsBytesExplainer: వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు భారీ ధరలు.. మరి మైదానంలో మెప్పిస్తారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ రెండు నెలలపాటు జరిగే టోర్నీలో ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సీజన్‌ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన 'అన్‌క్యాప్‌డ్' (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని) ఆటగాళ్లు తమకు అవకాశమొస్తే అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ ప్లేయర్లు అంత భారీ ధరకు ఎందుకు అమ్ముడుపోయారు? వీరికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశముందా? అనే అంశాలను పరిశీలిద్దాం.

Details

అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు వీరే

నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు, ముంబయి) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు, పంజాబ్), అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు, లఖ్‌నవూ), ప్రియాన్ష్ ఆర్య (రూ.3.80 కోట్లు, పంజాబ్) అశుతోష్ శర్మ (రూ.3.80 కోట్లు, దిల్లీ) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు, సన్‌రైజర్స్), అంగ్‌క్రిష్ రఘువంశీ (రూ.3 కోట్లు, కోల్‌కతా) ప్రత్యేకంగా ఆకర్షించారు. వారిలో ప్రియాన్ష్ ఆర్యను మినహాయిస్తే మిగిలినవారందరికీ ఐపీఎల్ అనుభవం ఉంది.

Details

50 మ్యాచులాడిన అబ్దుల్ సమద్

ముంబయికి గతేడాది ఆడిన ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌, దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. 24 ఏళ్ల నేహల్ వధేరా గతేడాది ముంబయికి ఆడగా, ఈసారి తన సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అబ్దుల్ సమద్ ఇప్పటికే ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌లు ఆడి అనుభవం సంపాదించాడు. ఒత్తిడిలోనూ భారీ సిక్సర్లు బాదగల సత్తా ఉన్న ఈ ప్లేయర్ గతంలో సన్‌రైజర్స్ తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రియాన్ష్ ఆర్య ఈ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచే అవకాశం ఉంది. దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది.

Details

ప్రధాన ఆకర్షణగా నిలవనున్న రసిఖ్ సలామ్

అశుతోష్ శర్మ 2023 ముస్తాక్‌ అలీ ట్రోఫీలో యువరాజ్‌ సింగ్‌ రికార్డును బద్దలు కొట్టి సంచలనం సృష్టించాడు. 11 బంతుల్లో అర్ధసెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి కూడా అదే స్థాయిలో రాణిస్తే, త్వరలోనే టీమ్‌ఇండియాలోకి ఎంపిక కావచ్చని అంచనా. ఈ సీజన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన రసిఖ్ సలామ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. 25 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్‌ను మెగా వేలంలో ఆర్సీబీ రూ.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. గతేడాది దిల్లీ క్యాపిటల్స్ తరఫున 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసిన అతను, ఆసియా ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్‌లో యూఏఈపై ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

Details

సీఎస్కే తరుపున బరిలోకి దిగనున్న అన్షుల్ కాంబోజ్

లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ గత రెండు సీజన్లలో కోల్‌కతా తరఫున ఆడాడు. 2023లో 11 మ్యాచుల్లో 10 వికెట్లు తీయగా, కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే సామర్థ్యాన్ని చూపాడు. ఈ సారి ఆర్సీబీ తరఫున అన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉన్నందున, టీమ్‌ఇండియాలోకి ప్రవేశించే అవకాశముంది. హరియాణాకు చెందిన పేసర్ అన్షుల్ కాంబోజ్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేరళపై తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులిచ్చి 10 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికాడు. గత సీజన్‌లో ముంబయికి ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈసారి సీఎస్కే తరఫున బరిలోకి దిగనున్నాడు.