LOADING...
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!
ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ బౌలర్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ జస్పిత్ బుమ్రా గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట అతడు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వస్తాడని భావించారు. కానీ గాయం పూర్తిగా మానకపోవడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఆరంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన తాత్కాలిక జట్టులో బుమ్రాకు స్థానం కల్పించిన బీసీసీఐ, తర్వాత అతడి గాయం తీవ్రమైందని గుర్తించి జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో హర్షిత్ రానా ఎంపికయ్యాడు. అంతేకాకుండా బుమ్రా ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఊహించినా, తాజా సమాచారం ప్రకారం పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Details

తొలి రెండు వారాల పాటు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం

ప్రస్తుతం బుమ్రా పూర్తి స్థాయిలో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అతడి గాయం తీవ్రంగా ఉండడంతో మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న బుమ్రా, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం, తొలి రెండు వారాల పాటు బుమ్రా ఐపీఎల్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఇలా జరిగితే ముంబై ఇండియన్స్ ఆడే తొలి నాలుగు లీగ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. బీసీసీఐ కూడా బుమ్రాను మళ్లీ జట్టులోకి తీసుకురావడంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మెడికల్ రిపోర్ట్స్ బాగానే ఉన్నా వైద్యుల సూచనల మేరకు మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.

Details

ఏప్రిల్ మొదటి వారం లోపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్

ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం లోపు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతడిని పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే మైదానంలోకి తిప్పాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. నిజానికి బుమ్రా చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ గాయమే అతడిని జట్టు నుంచి తప్పుకునేలా చేసింది. గాయం తీవ్రత పెరగడంతో సర్జరీ కూడా చేయించుకున్నాడు. కోలుకున్న తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. అయితే చివరి టెస్ట్ మ్యాచ్‌లో మళ్లీ వెన్నునొప్పి రావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు ఐపీఎల్, మరికొన్ని ప్రధాన టోర్నమెంట్లకు దూరమవుతాడా? లేదా త్వరలో తిరిగి జట్టులోకి వస్తాడా? అన్నది సందేహంగా మారింది.