Robin Utappa: 'నేను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయలేదు'.. పీఎఫ్ కేసుపై రాబిన్ ఉతప్ప వివరణ
భారత జట్టు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ఉద్యోగుల పీఎఫ్ చెల్లింపుల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించిన ఉతప్ప, తనపై వచ్చే ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తాను 2018-19లో సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్‌గా ఎంపికయ్యానని చెప్పారు. తాను పెట్టుబడులు పెట్టి, కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించినా తాను ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను పోషించలేదన్నారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని, ప్రొఫెషనల్ క్రికెటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా, కామెంటేటర్‌గా బిజీగా ఉన్నానని చెప్పారు.
ఫండ్స్ తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలమైంది
తన పెట్టుబడుల ద్వారా తాను ఇచ్చిన ఫండ్స్‌ను తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలమైందన్నారు. పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో తన ఇన్‌వాల్వ్‌మెంట్ లేదని ఉతప్ప స్పష్టం చేశారు. తాను పీఎఫ్ అధికారులు నోటీసులు ఇచ్చినా, తన లీగల్ టీమ్ సమాధానమిచ్చిందన్నారు. సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉద్యోగుల పీఎఫ్‌లో రూ.23 లక్షలు జమ చేయకుండా మోసం చేసినట్లు తేలింది. ఈ విషయంపై పీఎఫ్ రీజనల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.