
Ashwin - CSK: 'ఇక నుంచి క్రికెట్‌పైనే దృష్టి పెడతా'.. సీఎస్‌కే వివరణపై అశ్విన్ రియాక్షన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను చైన్నై సూపర్ కింగ్స్ అధిక మొత్తంలో తీసుకుందని టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై సీఎస్‌కే అధికారిక ప్రకటన విడుదల చేయగా, తాజాగా రవిచంద్రన్ అశ్విన్ మరోసారి స్పందించి వివాదానికి ముగింపు పలికాడు.
Details
అశ్విన్ తొలి వ్యాఖ్యలు
తన యూట్యూబ్ ఛానెల్‌లో అనేక అంశాలపై చర్చించే అశ్విన్, గత ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే చేసిన ఒక నిర్ణయాన్ని ప్రస్తావించాడు. సౌతాఫ్రికా ఆటగాడు బ్రెవిస్ బేస్ ప్రైస్ కేవలం రూ.75 లక్షలే అయినప్పటికీ, గుర్జప్‌నీత్ సింగ్ గాయం కారణంగా అతడిని రిప్లేస్‌మెంట్‌గా రూ.2.2 కోట్లకు తీసుకుందని తెలిపాడు. ఇతర జట్లు ధర చూసి వెనక్కి తగ్గగా, సీఎస్‌కే మాత్రం పట్టుబట్టి బ్రెవిస్‌ను తీసుకుందని ఆయన పేర్కొన్నాడు. దీనితో సీఎస్‌కే నిబంధనలు అతిక్రమించిందన్న ఆరోపణలు వినిపించాయి. రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌కు గాయపడిన ఆటగాడి కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నియమం ఉల్లంఘించారనే విమర్శలు కూడా వచ్చాయి.
Details
సీఎస్‌కే వివరణ
ఈ ఆరోపణలకు చెన్నై సూపర్ కింగ్స్ వెంటనే స్పందించింది. "బ్రెవిస్‌తో చేసిన ఒప్పందం పూర్తిగా ఐపీఎల్ నియమావళి ప్రకారం జరిగింది. ఎటువంటి అక్రమాలకు చోటులేదు. రిప్లేస్‌మెంట్ ప్లేయర్ ఫీజు గాయపడిన ఆటగాడి కంటే ఎక్కువ ఇవ్వలేమన్న నిబంధనను కచ్చితంగా పాటించాం. గుర్జప్‌నీత్‌ను మెగా వేలంలో రూ.2.2 కోట్లకు కొనుగోలు చేశాం. అతడి స్థానంలో వచ్చిన బ్రెవిస్‌కు కూడా అదే మొత్తం ఇచ్చాం. అంతేకాక, సీజన్ మధ్యలో రిప్లేస్‌మెంట్ ఆటగాడిని తీసుకుంటే, అతడి మ్యాచ్ ఫీజు తగ్గే అవకాశం కూడా ఉంటుందని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ స్పష్టతనిచ్చింది.
Details
అశ్విన్ రెండో స్పందన ఇదే
సీఎస్‌కే వివరణ తరువాత మరోసారి స్పందించిన అశ్విన్, తాను కేవలం ప్రజల్లో ఉన్న అనుమానాలను మాత్రమే ప్రస్తావించానని, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చిందని చెప్పాడు. 'సోషల్ మీడియాలో ఏమి చర్చనీయాంశమవుతుందో దానికంటే నాకు క్రికెట్ ముఖ్యమైనది. మా అభిప్రాయాలను తెలియజేయడానికే యూట్యూబ్ వీడియోలు చేస్తాను. వాటిని చూసే వారు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు. చూడనివారు మాత్రమే తప్పుగా అర్ధం చేసుకుంటారు. నేటి రోజుల్లో ఒక శీర్షిక ఆధారంగానే వార్తలు తయారవుతున్నాయి. ఈ విషయంలో ఎవరి వైపు నుంచి తప్పు జరగలేదు. ఫ్రాంచైజీ, ఆటగాడు, ఐపీఎల్ పాలక మండలి అందరూ నియమాలు పాటించారు. నా పాత వీడియోలో నేను బ్రెవిస్ ఒప్పందంపై తప్పుగా వ్యాఖ్యానించలేదంటూ ఈ వివాదానికి తెరదీశాడు.