ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్.. సఫారీల జోరు కొనసాగుతుందా?
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించి ఆత్మివిశ్వాసంతో ఉన్న సౌతాఫ్రికా జట్టు.. మూడో గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొట్టబోతోంది. ఇప్పటికే నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి.. మూడో గేమ్‍లో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి మ్యాచ్‌లో దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. తర్వాత లక్నోలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా మట్టి కరిపించింది. అయితే, గతేడాది జరిగిన ICC T20 ప్రపంచకప్‌లో మాత్రం సౌతాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించింది. ఈ అనుభవంతో వరుస విజయాలతో ఊపు మీద సౌతాఫ్రికా, డచ్ టీమ్‌ను ఢీకొట్టేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగనుంది.
వన్డేల్లో సౌతాఫ్రికాదే పైచేయి
ఇప్పటి వరకు నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మధ్య 7 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 6 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా, మూడింట్లోనే సౌతాఫ్రికానే గెలిచింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ట్రాక్ నెమ్మదిగా ఉండటంతో ఈ వేదికపై ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో స్పిన్నర్లు బాగా రాణించారు. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.