ICC- Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో ఐసీసీ కీలక భేటీ.. త్వరలోనే ప్రత్యక్ష పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB)తో బంగ్లాదేశ్‌లో ప్రత్యక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు ఆడబోయే మ్యాచ్‌ల వేదికల మార్పుపై ఐసీసీ తన తుదినిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు, మంగళవారం బీసీబీ-ఐసీసీ మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరగడం గమనార్హం. ప్రస్తుతం అయితే టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనబోయే మ్యాచ్‌ల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలి కాలంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొనగా, ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి.
Details
బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు నిలిపివేత
ఈ పరిస్థితుల మధ్య బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) రూ.9.20 కోట్లకు కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కేకేఆర్ అతడిని రిలీవ్ చేసింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో భద్రతా కారణాలను చూపుతూ టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐసీసీకి లేఖ రాసింది. అయితే దీనిపై ఐసీసీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Details
ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం
ఈ నేపథ్యంలోనే బీసీబీ ఈ విషయమై నాలుగు సార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ దశలో తన మ్యాచ్‌లను ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా, అలాగే ఫిబ్రవరి 17న నేపాల్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆడాల్సి ఉంది. మెగాటోర్నీ ప్రారంభానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, వేదికల మార్పు సాధ్యం కాకపోవచ్చని ఐసీసీ బీసీబీకి సూచాయగా తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, ఈ అంశంపై త్వరలోనే ఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.