Pakistan : భారత్ మ్యాచ్ బహిష్కరణపై పీసీబీ డైలమా.. ప్రధాని షెహబాజ్‌కు నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన కీలక సమావేశం ముగిసిన తర్వాత,టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకోనున్నారని సమాచారం. లాహోర్‌లో ఐసీసీ ఉన్నతాధికారులతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐదు గంటలకు పైగా సాగిన సుదీర్ఘ భేటీ నిర్వహించింది. ఫిబ్రవరి 15న భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ దగ్గర పడుతుండటంతో, ఈ వ్యవహారం ప్రపంచ క్రికెట్‌లో పెద్ద చర్చగా మారింది. గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పాల్గొన్నారు.
వివరాలు
ఇవాళ మీడియాతో మొహ్సిన్ నఖ్వీ మాట్లాడే అవకాశం
ఈ మ్యాచ్‌పై స్పష్టత రాకపోతే టోర్నీనే ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉండటంతో, ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, పీసీబీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు కీలకంగా మారనున్నాయని, రాజకీయ పరిస్థితులు, క్రికెట్‌పై ప్రభావం అన్నింటినీ బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోనున్నారని అధికారులు అంటున్నారు. ఇదే విషయంపై మొహ్సిన్ నఖ్వీ ఇవాళ మీడియాతో మాట్లాడే అవకాశమూ ఉంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయమే ఈ భేటీకి కారణమైంది.
వివరాలు
పాక్‌కు ఐసీసీ 24 గంటల డెడ్‌లైన్
ఫిబ్రవరి 2న ఈ ప్రకటన రావడంతో, వరల్డ్ కప్‌కు వారం కూడా మిగలకముందే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంగ్లాదేశ్ కూడా ఈ చర్చల్లో భాగమవడం గమనార్హం. ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్‌లోనే అతిపెద్ద ఆదాయ వనరు కావడంతో, ఈ మ్యాచ్ లేకపోతే టోర్నీ ఆదాయం, ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఐసీసీ భావిస్తోంది. ఈ మ్యాచ్ రద్దయితే సభ్య దేశాలకు వచ్చే వార్షిక ఆదాయంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్ ప్రారంభమైన నేపథ్యంలో, వచ్చే 24 గంటల్లో తీసుకునే నిర్ణయమే ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నదాన్ని తేల్చనుంది.