T20 World Cup: ఐసీసీ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా వైదొలిగింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిరాకరించింది. తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే ఈ ప్రతిపాదనకు ఐసీసీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అధికారికంగా లేఖ రాసి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసినట్లు తెలియజేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
Details
దుబాయ్ లో కీలక సమావేశం
బంగ్లాదేశ్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ చైర్మన్ జై షా అధ్యక్షతన శుక్రవారం దుబాయ్‌లో కీలక సమావేశం జరిగింది. అంతకుముందు చివరి ప్రయత్నంగా తమ వివాదాన్ని డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి పంపాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే ఆ కమిటీకి అప్పీల్ అధికారాలు లేవని, ఐసీసీ తుది నిర్ణయమే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఐసీసీ నిర్దేశించిన గడువులోగా బంగ్లాదేశ్ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా స్కాట్లాండ్‌కు ఈ అవకాశం లభించింది.
Details
ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ఎంపిక
ఇప్పటివరకు స్కాట్లాండ్ ఐదు టీ20 వరల్డ్‌కప్‌లలో పాల్గొంది. 2022, 2024 ఎడిషన్లలో కూడా ఆడింది. సూపర్-8 దశకు చేరుకోలేకపోయినా, బలమైన జట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ముఖ్యంగా 2024 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను దాదాపుగా ఓడించే స్థాయిలో పోరాడింది. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్‌ల కంటే వెనుకబడినప్పటికీ, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు అవకాశం దక్కింది. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి బయటకు వెళ్లడంతో గ్రూప్-సీలో స్కాట్లాండ్, నేపాల్, వెస్టిండీస్, ఇటలీ జట్లు ఉండనున్నాయి.