వన్డే ప్రపంచ కప్: న్యూజిలాండ్ తో మ్యాచుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం?
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్ తో ఇండియాకు జరిగే మ్యాచును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో కేవలం 3బంతులు బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా గాయానికి గురయ్యాడు. కాలి మడమకు గాయం తగలడంతో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం, ఫిట్నెస్ ని తిరిగి తెచ్చుకోవడానికి హార్దిక్ పాండ్యా బెంగళూరులోని NCA కు పయనమవుతున్నాడని సమాచారం. బీసీసీఐకి చెందిన వైద్య సిబ్బంది హార్దిక్ పాండ్యా కాలిమడమను స్కాన్ చేసి రిపోర్టు అందించిందని, ఇంజక్షన్ ద్వారా గాయం తగ్గిపోతుందని చెప్పినట్లు సమాచారం.
హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం
అయినా కూడా ధర్మశాలలో అక్టోబర్ 22న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచులో హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అసలు గాయం ఎలా అయ్యింది? బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ కి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో, మూడవ బంతి వేయగానే లిట్టన్ దాస్ దాన్ని ఆడాడు. అప్పుడు ఆ బంతి తన వైపే రావడంతో హార్దిక్ పాండ్యా తన కాలిని అడ్డుగా పెట్టాడు. దాంతో కాలు మలుపు తిరిగి మడమ దగ్గర గాయమయ్యింది. వెంటనే వైద్య సిబ్బంది వచ్చేసి హార్దిక్ పాండ్యాను తీసుకెళ్లారు. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచులో హార్దిక్ పాండ్యా మిస్ అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది.