Page Loader
Virat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప
కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప

Virat Kohli: కోహ్లీకి నచ్చకపోతే అవకాశాలు ఇవ్వడు.. అందుకే రాయుడును తప్పించారు : రాబిన్ ఉతప్ప

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల యువరాజ్ సింగ్ కెరీర్ తక్కువ సమయంలో ముగియడంలో కోహ్లీ పాత్ర ఉందని ఉతప్ప ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో అంబటి రాయుడు ఎంపిక కాకపోవడానికి కూడా కోహ్లీనే కారణమని అన్నారు. కోహ్లీకి రాయుడంటే ఇష్టం లేదని, అందుకే అతన్ని జట్టులోకి తీసుకోలేదని ఉతప్ప చెప్పారు. విరాట్‌కు ఎవరైనా నచ్చకపోతే, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తారన్నారు. అతనికి నచ్చకపోతే వాళ్లకు అవకాశం ఇవ్వడని, అంబటి రాయుడు విషయంలో కూడా అదే జరిగిందన్నారు.

Details

అప్పట్లో సెలక్షన్ కమిటీపై విమర్శలు

2019వరల్డ్ కప్‌కు రాయుడు పూర్తిగా సిద్ధంగా ఉండి కూడా ఎంపిక కాలేకపోయారని ఉతప్ప పేర్కొన్నారు. వరల్డ్ కప్ జట్టులో నాలుగో స్థానంలో అంబటి రాయుడును కాకుండా, విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సెలక్షన్ కమిటీ శంకర్‌ను 'త్రీడీ ప్లేయర్'గా అభివర్ణించింది. అయితే శంకర్ తన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరల్డ్ కప్‌లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, అతనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. 2019 వరల్డ్ కప్ జట్టులో ఎంపికకు సంబంధించి అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు.

Details

అన్యాయం జరిగిందన్న రాయుడు

తనకు అన్యాయం జరిగిందని రాయుడు ఓ సందర్భంలో తెలిపినప్పుడు, ప్రసాద్ దీనిపై స్పందిస్తూ, 'అది అపార్థం కావచ్చని, జట్టు ఎంపికలో సెలక్టర్లతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. అప్పట్లో రాయుడు తన ఎంపిక కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీని ఉతప్ప చేసిన ఈ ఆరోపణలు మరోసారి క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసే అవకాశముంది. సెలక్షన్ ప్రక్రియపై అప్పట్లోనే ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.