T20 World Cup: టీ20 ప్రపంచ కప్ పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తే.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తమ ప్రభుత్వమే తీసుకుంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. అయితే పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఒకవేళ పాకిస్థాన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగితే వారి స్థానంలో బంగ్లాదేశ్‌ను బ్యాకప్‌గా ఉంచాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రూప్-ఏలో పాకిస్థాన్ స్థానాన్ని బంగ్లాదేశ్‌తో భర్తీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. గ్రూప్-ఏకు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరగాల్సి ఉండటంతో.. ఈ మార్పు వల్ల పెద్దగా లాజిస్టికల్ సమస్యలు ఉండవని ఐసీసీకి దగ్గరగా ఉన్న ఓ అధికారి తెలిపారు.
Details
గ్రూప్-ఏలో బంగ్లాదేశ్ అవకాశం
పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే, బంగ్లాదేశ్‌కు గ్రూప్-ఏలో అవకాశం ఇస్తారు. బీసీబీ తొలుత కోరినట్టే శ్రీలంకలోనే అన్ని మ్యాచ్‌లు ఆడే వీలుంటుంది. దీనివల్ల నిర్వహణ పరంగా స్వల్ప సవాళ్లే ఎదురవుతాయని ఆ అధికారి హెచ్‌టీకి వెల్లడించారు. ఇదే సమయంలో క్రిక్‌బజ్ నివేదిక మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పాకిస్థాన్ టోర్నీని బహిష్కరించే పరిస్థితి లేదని ఆ కథనం పేర్కొంది. ఐసీసీ-బీసీసీఐ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. భారత్ ఆతిథ్యం ఇస్తున్న గ్లోబల్ టోర్నీల్లో పాకిస్థాన్ భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు. అందుకే 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌తో పాటు శ్రీలంకను సహ ఆతిథ్య దేశంగా ఎంపిక చేశారు.
Details
టోర్నీ నుంచి తప్పుకొనే అవకాశం లేదు
పాకిస్థాన్ తమకు అనుకూలమైన వేదిక అయిన శ్రీలంకలోనే మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో.. టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సోమవారం సమావేశమైనట్లు మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. అన్ని ప్రత్యామ్నాయాలపై ప్రధానికి వివరించామని, తుది నిర్ణయం వచ్చే వారం ఆరంభంలో తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మియాన్ మహ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై ఆయనకు వివరించాను. అన్ని అవకాశాలను తెరిచి ఉంచుతూ సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.
Details
పాకిస్థాన్ మీడియాలో ఊహాగానాలు
తుది నిర్ణయం శుక్రవారం లేదా వచ్చే సోమవారం తీసుకోవాలని నిర్ణయించామని నఖ్వీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుకు ప్రతిగా పాకిస్థాన్ ప్రభుత్వమే జట్టును ప్రపంచకప్ నుంచి తప్పించవచ్చని పాకిస్థాన్ మీడియాలో ఊహాగానాలు సాగాయి. ఒకవేళ టోర్నీలో పాల్గొన్నా.. ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే గ్రూప్-ఏ మ్యాచ్‌ను బహిష్కరించడం వంటి ప్రతీకాత్మక చర్యలకు పీసీబీ వెళ్లొచ్చని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.