LOADING...
Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత
ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత

Asia Cup: ఉగ్రదాడి ప్రభావం.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ నిర్వహణపై సందిగ్ధత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసియా కప్‌ కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, భారత్-పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.

Details

బీసీసీఐపై ఒత్తిడి.. ట్విట్టర్‌లో విరుచుకుపడిన నెటిజన్లు

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత బీసీసీఐ ఆసియా కప్‌ నుండి తప్పుకుంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదలవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రజలు బీసీసీఐపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'ఇలాంటి సందర్భాల్లో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలా?' అంటూ వినిపిస్తున్న ప్రశ్నలు బీసీసీఐపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

Details

బీసీసీఐ నిర్ణయంపై కేంద్ర క్రీడాశాఖ స్పందన

ఈ విషయంలో తమకు అధికారం లేదని, అయినా ప్రజల భావోద్వేగాల్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి. ఒక అధికారిక వర్గం ప్రకారం, ''ప్రస్తుత క్రీడా నియమావళి ప్రకారం మేము జోక్యం చేసుకోలేము. కానీ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలని పేర్కొన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌లో బీసీసీఐ తమ జట్టు బరిలోకి దించకపోతే, ఆ మ్యాచ్‌కు పాక్‌కు వాక్ఓవర్ లభిస్తుంది. అంటే పాయింట్లు నేరుగా పాకిస్తాన్ ఖాతాలోకి చేరతాయి. ఇది ద్వైపాక్షిక మ్యాచ్ కాకుండా బహుళ జట్ల టోర్నమెంట్ కావడంతో, వాక్ఓవర్ వల్ల ఇతర జట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

Details

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్‌

2025 ఆసియా కప్‌ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్‌లో సాగనుంది. భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్-4 దశకు చేరితే మరోసారి ఒకరినొకరు ఢీకొనే అవకాశముండగా, ఫైనల్లోనూ మరోసారి తలపడే అవకాశముంది. భారత్, పాక్ జట్లు తమ తమ లీగ్ మ్యాచ్‌లు, సూపర్-4ను అధిగమించి ఫైనల్‌కు చేరితే, ఈ రెండు జట్లు ఆసియా కప్‌లో మూడుసార్లు తలపడే అవకాశముంది.