18,000 పరుగులు.. 12 హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సాధించిన ఘనతలు ఇవే..
వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో జరిగన మ్యాచ్‌లో పలు ఘనతలు సాధించాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 18,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 5వ భారతీయుడిగా నిలిచాడు. రోహిత్ 457 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 43.46 సగటుతో 18,040 పరుగులు చేశాడు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (26,121), రాహుల్ ద్రవిడ్ (24,208), సౌరవ్ గంగూలీ (18,575) అంతర్జాతీయ పరుగుల పరంగా రోహిత్ కంటే ముందున్నారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 18,000 పరుగుల మార్క్‌ను అందుకున్న 20వ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ 2007లో టీమ్ ఇండియా ఆటగాడిగా అరంగేట్రం చేశాడు.
ప్రపంచ కప్‌లో రోహిత్ 12వ హాఫ్ సెంచరీ
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. 101 బంతుల్లో 87 పరుగుల చేసి.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ వన్డేలో హాఫ్ సెంచరీతో రోహిత్ ప్రపంచకప్‌లో తన 12వ ఫిఫ్టీని పూర్తి చేశాడు. దీంతో రోహిత్ శర్మ 12 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన విరాట్ కోహ్లి, షకీబ్ అల్ హసన్, కుమార సంగక్కర లాంటి దిగ్గజాల సరసన చేరాడు. అత్యధిక హాఫ్ సెంచరీల ఫీట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మొదటిస్థానంలో ఉన్నారు. సచిన్ ఖాతాలో 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో రోహిత్, విరాట్ కోహ్లి, షకీబ్ అల్ హసన్, సంగక్కర ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ 65.52 సగటుతో 1,376 పరుగులు చేశాడు.
2023లో 1,000 వన్డే పరుగులు పూర్తి
2023లో 1,000 వన్డే పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. కేవలం 22 ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ ఈ ఏడాది 1,000 (1,056) పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలు, రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. 2023లో అతని సగటు 55.57 కాగా, స్ట్రైక్ రేట్ 113.30 కావడం గమనార్హం. శుభ్‌మన్ గిల్ (1,334), శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక (1,062) మాత్రమే ఈ ఏడాది వన్డేలో 1,000పైగా పరుగులు చేశారు. ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో రోహిత్ ఇప్పుడు 1,000ప్లస్ వన్డే పరుగులు చేశాడు. 2013, 2017, 2018, 2019లో కూడా ఈ మైలురాయిని చేరుకున్నాడు.