Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు,రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది. ఇప్పటివరకు భారత జట్టు మొత్తం ఆధిక్యం 308 పరుగుల వద్ద ఉంది.ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (5) నిరాశపరిచాడు,అలాగే యశస్వి జైస్వాల్ (10)విరాట్ కోహ్లీ (17)కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (33),రిషభ్ పంత్ (12)ఉన్నారు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీస్తే, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా విలవిల
టీమిండియా పేస్ దాడికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పోరాడలేకపోయారు.జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దళం కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ షద్మాన్ (2)ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత, ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో జకీర్ హసన్ (3), మోమినల్ హక్ (0)లను ఔట్ చేశాడు. కెప్టెన్ షాంటో (20) కాసేపు క్రీజులో నిలిచినప్పటికీ, భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా వికెట్లు వరుసగా కోల్పోయింది.
రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్‌తో రెండు వికెట్లు
షాంటో, ముష్ఫికర్ రహీమ్ (8) ఔటైన వెంటనే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందని అందరూ భావించారు. అయితే, షకీబ్ అల్ హసన్ (32), లిటన్ దాస్ (22) ఆరో వికెట్ కోసం 51 పరుగులు జోడించి దెబ్బతిన్న ఇన్నింగ్స్‌ను కాసేపు నిలబెట్టారు. రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్‌తో వారిద్దరిని ఔట్ చేయడంతో భారత్‌కు మళ్లీ పైచేయి సాధించింది. మెహదీ హసన్ మిరాజ్ (27) కొద్దిసేపు పోరాడినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు.