Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?
వన్డే ప్రపంచ కప్-2023లో టఫ్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఓటమి అనేది లేకుండా టీమిండియా- న్యూజిలాండ్ జట్లు నాలుగేసి వరుస విజయాలతో ఊపుమీద ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఈ రెండు జట్లు తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. రెండు టీమ్‌లలో 5వ గేమ్‌లో గెలిచేది ఎవరు? ఈ టోర్నీలో తొలి ఓటమిని చవిచూసేది ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
భారత్‌పై న్యూజిలాండ్‌కు కాస్త మెరుగైన రికార్డు
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 116 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. ఇరు టీమ్‌లు పోటాపోటీగా గెలిచాయి. అలాగే భారత్‌పై న్యూజిలాండ్‌కు కాస్త మెరుగైన రికార్డు ఉంది. టీమిండియా 50 మ్యాచ్‌లలో గెలవగా, న్యూజిలాండ్ 58 గేమ్‌లలో విజయం సాధించింది. ఏడు గేమ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. వన్డే ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్- భారత్ తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఐదు సార్లు గెలవగా, భారత్ మూడింట్లో విజయం సాధించింది. ఒకటి రద్దయింది.
హెచ్‌పీసీఏ స్టేడియంలో విరాట్ కోహ్లీ సగటు 106
ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఏడు వన్డే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు సార్లు నెగ్గాయి. ఈ స్టేడియంలో న్యూజిలాండ్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ సుందరమైన మైదానంలో భారత్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే స్టేడియంలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ తలపడగా 364/9 స్కోరు నమోదైంది. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోరు. ధర్మశాలలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లి మూడు మ్యాచ్‌ల్లో 106తో 213 పరుగులు చేశాడు. గతంలో న్యూజిలాండ్ జట్టుపై 85 పరుగులతో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్‌పై విరాట్‌కు మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై ఐదు సెంచరీలు కొట్టాడు.
పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు
ఈ ప్రపంచ కప్‌లో భారత్ అత్యధిక పరుగులు రాబడుతోంది. ఇందులో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం పవర్‌ప్లే ఓవర్లలో (1-10)అత్యధిక రన్ స్కోరర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 18 ఇన్నింగ్స్‌లలో 113.99స్ట్రైక్ రేట్‌తో 554 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఈ ఏడాది వన్డేల్లో ఏడు అర్ధసెంచరీలు, రెండు సెంచరీలతో 923పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ మూడు సెంచరీలతో 790పరుగులతో ఈ సంవత్సరం వన్డేలో ఆ టీమ్ తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. విల్ యంగ్ ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండు 50-ప్లస్ స్కోర్‌లను సాధించాడు. టామ్ లాథమ్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. లాథమ్ 54.43 సగటుతో 871 పరుగులు చేశాడు.