IND vs SA: మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్.. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు మరో రసవత్తర పోరాటానికి సిద్ధమవుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు జరుగనున్న రెండో టీ20లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. కటక్‌లో జరిగిన తొలి టీ20ను అద్భుతంగా గెలుచుకున్న సూర్య సేన, అదే ఉత్సాహాన్ని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలనే ధీమాతో ఉంది. తొలి మ్యాచ్‌లో భారీ పరాజయం ఎదురైనా, సఫారీ జట్టును తక్కువ అంచనా వేయడం మాత్రం సరైంది కాదు. అన్ని రంగాల్లో శక్తివంతంగా ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్ 2-0తో ఆధిక్యం సాధించగలదా అనేది ఆసక్తికర అంశం.
వివరాలు
భారత బ్యాటింగ్‌లో ఇంకా ఆందోళనలు
తొలి టీ20లో విజయం దక్కినా, భారత బ్యాటింగ్‌లో ఇంకా ఆందోళనలున్నాయి. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో చెలరేగకపోతే ఫలితాలు పూర్తిగా మారిపోయి ఉండేవి. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. టీ20 ఓపెనర్‌గా ఆడినప్పటి నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న గిల్, వన్డే-టెస్ట్ మ్యాచ్‌లలో ఉన్న సత్తాను ఇక్కడ చూపించలేకపోతున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టితే, ఈ సిరీస్‌లో అయినా సరే గిల్ తన స్థాయిని నిరూపించుకోవాలి. క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా సూర్య నిలకడగా పరుగులు చేయకపోవడంతో, ఈ మ్యాచ్‌లో అతని ప్రదర్శన కీలకం కానుంది.
వివరాలు
భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువ
అయితే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ భారీ స్కోర్లు చేయడం భారత జట్టుకు బలాన్నిస్తోంది. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చి బ్యాట్‌తో దూకుడు చూపించడం మంచి సంకేతం. శివమ్ దూబే, అక్షర్ పటేల్,జితేశ్ శర్మలు పరుగులు చేస్తే భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోవచ్చు. బౌలింగ్ విభాగంలోనూ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా,అర్ష్‌దీప్ సింగ్ చక్కని ఫామ్‌లో ఉన్నారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వికెట్లు తీస్తూ జట్టుకు సహకరిస్తున్నారు. దూబే,హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇస్తే మరింత బలాన్నిస్తుంది. రెండో టీ20కు భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో ప్రతీకార ధోరణితో ఆడేందుకు సిద్ధమవుతోంది.
వివరాలు
పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం
ముల్లాన్‌పుర్ పీసీఏ కొత్త స్టేడియంలో ఈ పోరు జరగనుంది. ఈ మైదానంలో పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. నేటి రాత్రి మంచు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవచ్చు. ఈ వేదికలో ఇప్పటివరకు 11 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి, అందులో తొలి బ్యాటింగ్ చేసిన జట్లు 6 సార్లు విజయం సాధించాయి. 200 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఉంచితే గెలిచే అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరించనుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
వివరాలు
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెస్, సిపమ్లా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్.