LOADING...
IND vs SA: టీమిండియా బ్యాటింగ్ పతనం: స్పెషలిస్టుల కంటే టెయిల్-ఎండర్లు మెరుగైన ఆట
టీమిండియా బ్యాటింగ్ పతనం: స్పెషలిస్టుల కంటే టెయిల్-ఎండర్లు మెరుగైన ఆట

IND vs SA: టీమిండియా బ్యాటింగ్ పతనం: స్పెషలిస్టుల కంటే టెయిల్-ఎండర్లు మెరుగైన ఆట

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసే టీమిండియా... దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో తీవ్రమైన ఓటమిని ఎదుర్కొన్న భారత్‌, రెండో మ్యాచ్‌లో కూడా అదే దారిలో సాగుతోంది. ప్రొటీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా 489 పరుగులు చేయగా... టీమిండియా కేవలం 201 రన్స్‌కే ఆల్‌ఔట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 26 పరుగులు చేసి, మొత్తంగా 314 రన్స్ ఆధిక్యాన్ని అందుకుంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో, భారత్‌కు దాదాపు 400 పరుగుల లక్ష్యాన్ని విధించే అవకాశం కనిపిస్తోంది. పిచ్ ఇప్పటికే స్పిన్‌కు అనుకూలంగా మారుతుండటంతో, రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణమైన పోరాటం కనబర్చకపోతే టీమిండియా వైట్‌వాష్‌ను తప్పించుకోవడం కష్టమే.

వివరాలు 

రెచ్చిపోయిన యాన్సెన్ 

9/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆటను కొనసాగించిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (58),కేఎల్‌ రాహుల్‌ (22) జట్టు ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. తొలి గంటలో వికెట్ కోల్పోకుండా 56 పరుగులు రావడంతో, భారత్ కూడా పెద్ద స్కోర్‌కే వెళుతుందని అనిపించింది. అయితే ఇద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యాన్సెన్ భీకరంగా బౌలింగ్ చేస్తూ వరుస వికెట్లు పడగొట్టడంతో, భారత్ ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. సాయి సుదర్శన్‌ (15), ధృవ్ జురెల్‌ (0), రిషబ్ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ రెడ్డి (10) వరుసగా విఫలమయ్యారు. 1

వివరాలు 

అత్యధిక డెలివరీలను ఎదుర్కొన్న బ్యాటర్‌గా కుల్దీప్ యాదవ్

50 రన్స్‌కు ముందే ఆలౌట్ అయ్యే పరిస్థితి కనిపించినప్పుడు, వాషింగ్టన్ సుందర్‌ (48), కుల్దీప్ యాదవ్‌ (19) కీలక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఒక సెషన్ పాటు వికెట్ ఇవ్వకుండా నిలిచిన ఈ జోడీ సుందర్ ఔటయ్యాక మాత్రం భారత్ ఆలౌట్ అవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ అత్యధిక డెలివరీలను ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన అతను 134 బంతులు ఆడి 19 పరుగులు సాధించాడు. 92 బంతులు ఎదుర్కొన్న సుందర్‌తో కలిసి 34.4 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం ప్రశంసనీయం.

వివరాలు 

జట్టుకు ఓటమి తప్పిస్తారా..

ఇలాంటి పోరాటం ప్రధాన బ్యాటర్లు చేసి ఉంటే మ్యాచ్ గతి పూర్తిగా మారిపోయేదేమో. కుల్దీప్ ప్రదర్శించిన సహనం, తపన ప్రధాన బ్యాటర్లలో కనిపించకపోవడం టీమిండియాకు పెద్ద లోటుగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో స్పెషలిస్టు బ్యాటర్లు పోరాటం చేసి జట్టుకు ఓటమి తప్పిస్తారేమో చూడాలి.