LOADING...
Womens T29: భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం
భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం

Womens T29: భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 14, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అత్యంత ప్రాధాన్యం పొందిన ఈ పోరు ఆదివారం జరగనుంది. ఏ క్రీడలోనైనా భారత్, పాక్ జట్లు తలపడితే ప్రత్యేక ఆకర్షణ నెలకొంటుంది. ముఖ్యంగా క్రికెట్‌లో ఈ పోటీపై అభిమానుల ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై స్పష్టమైన ఆధిపత్యం కొనసాగిస్తోంది. అదే విజయపరంపరను కొనసాగిస్తూ చిరకాల ప్రత్యర్థిని ఓడించి ప్రపంచకప్ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

వివరాలు

తొలి మ్యాచ్‌కు సిద్ధమైన హర్మన్‌ప్రీత్ సేన..

ప్రపంచకప్ ప్రారంభమై రెండు రోజులు పూర్తవగా, మూడో రోజున భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. గ్రూప్-1లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌కు కూడా ఇది టోర్నీలో తొలి మ్యాచ్ కావడం విశేషం. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని ఉత్సాహంగా ఉన్న భారత జట్టు, అదే జోరును కొనసాగిస్తూ టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్న భారత్, ఘన విజయంతో తన ప్రచారాన్ని ఆరంభించాలనే పట్టుదలతో ఉంది.

వివరాలు

అన్ని విభాగాల్లోనూ బలంగా భారత్..

భారత మహిళల క్రికెట్ జట్టు గతంతో పోలిస్తే ఎంతగా అభివృద్ధి చెందిందో వన్డే ప్రపంచకప్‌లో స్పష్టంగా కనిపించింది. ఆ విజయాన్ని కేవలం అదృష్టంగా చెప్పలేం. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తీరు, ఫైనల్లో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన సవాళ్లను ఎదుర్కొన్న విధానం జట్టు సామర్థ్యాన్ని చాటిచెప్పాయి. ప్రపంచకప్ అనంతరం ఆశించిన స్థాయిలో నిలకడైన ప్రదర్శనలు చేయకపోయినా, ఈ టోర్నీలో భారత్‌కు మంచి అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓపెనర్లుగా స్మృతి మంధాన, షెఫాలి వర్మ దూకుడైన ఆరంభాలు అందించగల సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు. మధ్యవరుసలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి అనుభవజ్ఞులు జట్టుకు బలంగా నిలుస్తున్నారు.

Advertisement

వివరాలు

పాకిస్థాన్‌కు సవాల్ తప్పదు..

భారత్ జట్టు బలం గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ, పాకిస్థాన్ జట్టులో అంతగా మార్పులు చోటుచేసుకోలేదు. అందువల్ల ఆ జట్టును ఓడించడం భారత జట్టుకు పెద్ద కష్టంగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు స్పిన్ బౌలింగ్ ప్రధాన బలం. పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలిస్తే వారు గట్టి పోటీ ఇవ్వగలరు. అయితే ఇంగ్లాండ్ పరిస్థితుల్లో వారికి సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా నుంచి బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మంచి ప్రదర్శన ఆశిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ముబీనా అలీ, ఆలియా రియాజ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇక ఆదివారం జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

Advertisement