Womens Cricket: రెండో టీ20లో భారత్‌కు గెలుపు అవసరం.. అమ్మాయిలు పుంజుకుంటారా?
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టు, ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేసిన దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
వివరాలు
అందుకే విఫలం..
భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ 34 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 47 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 36 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో భారత్ పెద్ద స్కోరు చేసేలా కనిపించినప్పటికీ, చివర్లో వేగాన్ని కొనసాగించడంలో విఫలమైంది. చివరి ఐదు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 33 పరుగులే జోడించగలిగింది.
వివరాలు
రిచా ఘోష్ డూకుడు..
రాబోయే రెండో టీ20 క్రికెట్‌లో భారత్ ముఖ్యంగా ఫినిషింగ్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రిచా ఘోష్ తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించడం జట్టుకు కీలకం కానుంది. బౌలింగ్ విభాగంలో శ్రేయాంక పాటిల్ (2/26), శ్రీచరణి (1/26) తప్ప మిగతా బౌలర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉండటంతో, ఆమెను అదుపులో ఉంచడం భారత జట్టుకు అత్యంత ముఖ్యంగా మారింది.