LOADING...
India A: విప్రాజ్ నిగమ్ తప్పిదం.. భారత్ 'ఏ'కు 10 పరుగుల జరిమానా, శ్రీలంక 'ఏ'కు ఊహించని లాభం
శ్రీలంక 'ఏ'కు ఊహించని లాభం

India A: విప్రాజ్ నిగమ్ తప్పిదం.. భారత్ 'ఏ'కు 10 పరుగుల జరిమానా, శ్రీలంక 'ఏ'కు ఊహించని లాభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
06:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో నోబాల్,వైడ్, స్లో ఓవర్‌రేట్ వంటి పెనాల్టీలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే ఓ ఆటగాడు చేసిన చిన్న పొరపాటు కారణంగా ప్రత్యర్థి జట్టుకు ఏకంగా 10 పరుగులు అదనంగా లభించడం మాత్రం చాలా అరుదు. సోమవారం శ్రీలంక 'ఏ'తో జరిగిన ట్రైసిరీస్ మ్యాచ్‌లో భారత్ 'ఏ' జట్టు ఇలాంటి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. యువ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ చేసిన తప్పిదం జట్టుకు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. భారత్ 'ఏ' బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విప్రాజ్ నిగమ్ పిచ్‌పై ఉన్న రక్షిత ప్రాంతం (ప్రొటెక్టెడ్ ఏరియా) మీదుగా రెండుసార్లు పరుగెత్తాడు. దీనికి ముందు మరో భారత బ్యాటర్ అనుకుల్ రాయ్ కూడా ఇదే నిబంధనను ఉల్లంఘించగా అంపైర్లు హెచ్చరిక జారీ చేశారు.

వివరాలు 

మొత్తం 10 పరుగులు శ్రీలంక 'ఏ' జట్టు ఖాతాలో..

ఆ తర్వాత విప్రాజ్ అదే తప్పును చేయడంతో మొదటిసారి ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. అయితే 37వ ఓవర్‌లో విప్రాజ్ మరోసారి పిచ్ మధ్యలోనే పరుగెత్తడంతో అంపైర్లు రెండోసారి కూడా ఐదు పరుగుల జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 పరుగులు శ్రీలంక 'ఏ' జట్టు ఖాతాలో జమయ్యాయి. ఫలితంగా శ్రీలంక 'ఏ' తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సమయానికి స్కోరు బోర్డుపై నేరుగా 10/0 కనిపించింది. ఈ అరుదైన ఘటన మ్యాచ్‌ను వీక్షిస్తున్న కామెంటేటర్లతో పాటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఇలాంటి పెనాల్టీలు ఎక్కువగా కనిపించకపోవడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

రెండుసార్లు అదే తప్పు చేసిన భారత్ 'ఏ' బ్యాటర్లు

ఎంసీసీ నిబంధనల ప్రకారం బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా లేదా అనవసరంగా పిచ్‌లోని రక్షిత ప్రాంతాన్ని దెబ్బతీసే విధంగా నడవకూడదు. ఒకసారి అంపైర్లు హెచ్చరించిన తర్వాత అదే ఇన్నింగ్స్‌లో మళ్లీ నిబంధన ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు ఇవ్వొచ్చు. భారత్ 'ఏ' బ్యాటర్లు రెండుసార్లు ఇదే తప్పు చేయడంతో శ్రీలంక 'ఏ'కు మొత్తం 10 పరుగులు అదనంగా లభించాయి.

Advertisement