LOADING...
India A vs Sri Lanka A: సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'
సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'

India A vs Sri Lanka A: సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'ను ఓడించిన శ్రీలంక 'ఎ'

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక 'ఎ' జట్టు సూపర్ ఓవర్‌లో ఇండియా 'ఎ'పై విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇరు జట్లు 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' 16 పరుగులు నమోదు చేయగా, భారత్ 'ఎ' 10 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 'ఎ' జట్టుకు శుభారంభం లభించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్ ఆటగాడు విప్రాజ్ నిగమ్ డేంజర్ ఏరియాలోకి రావడంతో అంపైర్లు శ్రీలంకకు 10 పెనాల్టీ పరుగులు మంజూరు చేశారు. ఈ అదనపు పరుగులే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయనే చర్చ సాగుతోంది.

వివరాలు 

83 పరుగులు చేసిన సదీర సమరవిక్రమ

శ్రీలంక తరఫున సదీర సమరవిక్రమ 102 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. నిరోషన్ డిక్వెల్లా 37,వనుజ సహన్ 25,అవిష్క ఫెర్నాండో 22, విశేన్ 17పరుగులతో తమ వంతు సహకారం అందించారు. భారత బౌలర్లలో ఆయుష్ బదోని రెండు వికెట్లు పడగొట్టగా, అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, సుర్యాంశ్ షెడ్జే తలో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇండియా 'ఎ' 49.2ఓవర్లలో 265పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒక్కరూ అర్ధసెంచరీ నమోదు చేయకపోవడంతో జట్టు కష్టాల్లో పడింది. 125 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో సుర్యాంశ్ షెడ్జే, విప్రాజ్ నిగమ్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.

వివరాలు 

భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన శ్రీలంక బౌలర్లు 

సుర్యాంశ్ 66 బంతుల్లో 72 పరుగులు చేయగా, విప్రాజ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 21 పరుగులు చేసి ఆకట్టుకోగా,ప్రభ్‌సిమ్రన్ 11 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ తిలక్ వర్మ 23, వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 37 పరుగులు చేసినప్పటికీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివర్లో సుర్యాంశ్, విప్రాజ్ పోరాటంతో భారత్ పోటీ స్కోరు నమోదు చేసింది. శ్రీలంక బౌలర్లలో విజయ్‌కాంత్, షిరాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. సహన్,ముతులన్,వనుజ సహన్ తలో వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరకు మ్యాచ్ టైగా ముగియగా,సూపర్ ఓవర్‌లో శ్రీలంక'ఎ'ఆధిపత్యం చాటుకుని ఉత్కంఠభరిత విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Advertisement