LOADING...
Thailand Open: ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్
ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

Thailand Open: ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్

వ్రాసిన వారు Moogati Shabari
May 14, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పి.వి. సింధు, కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ విజయాలతో తదుపరి దశకు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ పోటీల్లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 21-9, 21-12 స్కోర్లతో చైనీస్‌ తైపీకి చెందిన సియోటాంగ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో స్థానం సంపాదించింది.

వివరాలు

తన్విశర్మ, అన్మోల్‌ ఖార్బ్‌కు నిరాశ..

ఇక మాళవిక బాన్సోద్‌ కెనడాకు చెందిన వెన్‌ జాంగ్‌పై 13-21, 26-24, 21-13 తేడాతో గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకుంది. దేవిక సిహాగ్‌ కూడా జపాన్‌ క్రీడాకారిణి నత్సుకి నిదైరాపై 21-19, 13-21, 21-15 స్కోర్లతో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అయితే భారత యువ క్రీడాకారిణులు ఉన్నతి హుడా, తన్విశర్మ, అన్మోల్‌ ఖార్బ్‌కు నిరాశ ఎదురైంది. ఉన్నతి హుడా 21-11తో తొలి గేమ్‌ గెలిచినా, తరువాతి రెండు గేమ్‌ల్లో వెనుకబడుతూ థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చేతిలో 17-21, 16-21తో ఓడిపోయింది. తన్విశర్మ జపాన్‌కు చెందిన హినా అకెచి చేతిలో 17-21, 8-21తో పరాజయం పాలైంది. అన్మోల్‌ ఖార్బ్‌ కూడా చైనా స్టార్‌ యుఫెయ్‌తో జరిగినపోరులో 21-19, 13-21, 18-21 స్కోర్లతో తలవంచింది.

వివరాలు

పురుషుల సింగిల్స్ సాగిందిలా..

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ సింగపూర్‌కు చెందిన జేసన్‌ హెంగ్‌పై 21-16, 21-17తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. మరో భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కూడా సింగపూర్‌ ఆటగాడు లో కీన్‌ యూపై 21-14, 21-15 స్కోర్లతో గెలిచి తదుపరి దశకు చేరుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో ఆయుష్‌ శెట్టి జపాన్‌కు చెందిన కొడయ్‌ నరవొక చేతిలో 13-21, 21-17, 4-21తో ఓటమి చవిచూశాడు. తరుణ్‌ మన్నెపల్లి కూడా జపాన్‌ షట్లర్‌ కొకి వతనబె ఎదుట 12-21, 16-21తో పరాజయం పాలయ్యాడు.

Advertisement