LOADING...
Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. కొరియాతో పోరుకు సిద్ధం 
ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. కొరియాతో పోరుకు సిద్ధం

Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ .. కొరియాతో పోరుకు సిద్ధం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత పురుషుల హకీ జట్టు ఆసియా కప్ 2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సూపర్-4 చివరి మ్యాచ్‌లో చైనాపై భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది. 43 సంవత్సరాల తర్వాత చైనాపై భారత్ నమోదు చేసిన అతి పెద్ద విజయమిది. 1982లో తొలిసారి ఆసియా కప్ జరిగినప్పుడు కూడా భారత్ చైనాను ఇదే తేడాతో ఓడించింది. ఇక ఫైనల్‌లో భారత్ కొరియాతో తలపడనుంది. ఈ ఎడిషన్‌లో భారత్ గెలవలేని ఏకైక జట్టు కొరియానే. సూపర్-4లో భారత్-కొరియా మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. అంతేకాకుండా, కొరియా ఆసియా కప్‌లో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న జట్టు, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా.

Details

చరిత్రలో తొమ్మిదో ఫైనల్

భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ హాకీ ఫైనల్‌కు చేరుకుంది. 2003, 2007, 2017లో భారత్ మూడు సార్లు కప్ గెలుచుకోగా, 1982, 1985, 1989, 1994, 2013లో ఫైనల్‌లో ఓటమి పాలైంది. 2022లో జరిగిన చివరి ఆసియా కప్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి సెప్టెంబర్ 7న జరిగే టైటిల్ పోరులో గెలిచిన జట్టు నేరుగా ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం పొందుతుంది.

Details

చైనాపై భారత్ గోల్స్ వర్షం 

చైనాతో జరిగిన కీలక పోరులో భారత్ తరపున శీలానంద్ లక్రా నాలుగో నిమిషంలో తొలి గోల్ చేశాడు. ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్, 18వ నిమిషంలో మన్దీప్ సింగ్, 37వ నిమిషంలో రాజ్‌కుమార్ పాల్, 39వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్, 46వ, 50వ నిమిషాల్లో అభిషేక్ గోల్స్ చేశారు. హాఫ్ టైమ్ వరకు భారత్ 3-0 ఆధిక్యంలో ఉండగా, రెండో అర్ధభాగంలో మరిన్ని నాలుగు గోల్స్ చేసి 7-0తో మ్యాచ్‌ను ముగించింది. ఇక మరో మ్యాచ్‌లో కొరియా మలేషియాను 4-3 తేడాతో ఓడించింది. ఒక దశలో 0-2తేడాతో వెనుకబడి ఉన్న కొరియా, అద్భుత పునరాగమనం చేసి గెలిచింది. ఈ విజయంతో సూపర్-4లో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుని, భారత్‌తో ఫైనల్ బరిలోకి దిగనుంది.