
WCL 2025 : అదృష్టం ముద్దాడింది.. ఒక్క గెలుపుతో సెమీస్ బెర్త్ కొట్టేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో భారత్ తన సత్తా చాటింది. లీసెస్టర్‌లోని గ్రేస్ గ్రౌండ్‌లో జరిగిన 15వ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను ఓడించి ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ యువరాజ్ సింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఛాంపియన్స్‌కు నిరాశజనక ఆరంభం ఎదురైంది. ఓపెనర్లు క్రిస్ గేల్ కేవలం 9 పరుగులకే అవుట్ కాగా, లిండ్ల్ సిమన్స్ 2 పరుగులు మాత్రమే చేశాడు. వాల్టన్, పెర్కిన్స్ లాంటి ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
Details
చెలరేగిన పొలార్డ్
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. భారత బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించిన పొలార్డ్ 43 బంతుల్లో 8 సిక్సర్లు సొంతం చేసుకుని అజేయంగా 73 పరుగులు చేశాడు. చివరకు వెస్టిండీస్ ఛాంపియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్‌కి ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఉత్తప్ప (8), శిఖర్ ధావన్ (25) త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం గుర్కీరత్ మన్ (7), సురేష్ రైనా (7)లు కూడా ఎక్కువగా నిలవకపోవడంతో టీమిండియా కాస్త ఒత్తిడిలో పడింది.
Details
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్టువర్ట్ బిన్నీ
అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బిన్నీ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మార్చేశాడు. కేవలం 21 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయంగా 50 పరుగులు నమోదు చేశాడు. అతడికి యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21), యూసుఫ్ పఠాన్ (7 బంతుల్లో 21) మెరుగైన మద్దతునిచ్చారు. దీంతో ఇండియా ఛాంపియన్స్ జట్టు 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.