India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై జయభేరి.. అండర్-18 ఆసియా కప్ విజేతగా భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. జపాన్‌లోని కకామిగహారాలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టు జపాన్‌ను 4-1 గోల్స్ తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-18 హాకీ ఆసియా కప్ విజేతగా అవతరించింది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ రెండో నిమిషంలో ఆశిష్ తాని తొలి గోల్ నమోదు చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం 28వ, 34వ నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అతని అద్భుత ఆటతీరుతో భారత్ మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించింది.
వివరాలు
అదరగొట్టిన కెప్టెన్ కేతన్ కుష్వాహా..
జట్టు కెప్టెన్ కేతన్ కుష్వాహా కూడా 30వ నిమిషంలో కీలక గోల్ కొట్టి భారత ఆధిక్యాన్ని మరింత పెంచాడు. మరోవైపు జపాన్ జట్టు కేవలం ఒక గోల్‌కే పరిమితమైంది. మ్యాచ్ ముగిసే వరకు భారత ఆటగాళ్లు సమన్వయంతో కూడిన ఆటను ప్రదర్శిస్తూ 4-1 తేడాతో ఘన విజయాన్ని ఖాయం చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని హాకీ ఇండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. స్వర్ణ పతకం సాధించిన జట్టులోని ప్రతి క్రీడాకారుడికి రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించింది. అలాగే సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి రూ.1.5 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నట్లు తెలిపింది.
వివరాలు
ప్రధాని మోదీ ప్రశంసలు..
భారత్ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్టును అభినందించారు. యువ హాకీ క్రీడాకారుల ఈ ఘనత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. టోర్నమెంట్ మొత్తం జట్టు అసాధారణ ప్రతిభ, అంకితభావం మరియు జట్టు స్ఫూర్తిని కనబరిచిందని ఆయన అన్నారు. ఫైనల్‌లో సాధించిన ఈ విజయం చిరకాలం గుర్తుండిపోతుందని, దేశంలో యువతలో హాకీపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత యువ హాకీ జట్టు, ఆసియా ఖండంలో తమ బలాన్ని మరోసారి చాటింది. ఈ విజయం భారత హాకీ భవిష్యత్తుకు మరింత ఉత్సాహం, నమ్మకాన్ని అందించనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.