
IND vs Pak : ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి భారత్ ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో టీమ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో పాక్‌పై గెలుపొందింది. తొలుత భారత చెలరేగడంతో పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు సాధించింది. తిలక్ వర్మ (69*: 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఇక శివమ్ దూబె (33: 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
Details
భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ
147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5) రెండో ఓవర్ తొలి బంతికే ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో రవూఫ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటనే సూర్యకుమార్ (1) కూడా షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సల్మాన్ అఘాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే శుభ్‌మన్ గిల్ (12) కూడా ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో రవూఫ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి 25/3తో తీవ్ర ఒత్తిడిలో పడింది.
Details
తిలక్-సంజూ భాగస్వామ్యం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (24: 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా పునరుద్ధరించాడు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 58 పరుగులుగా ఉంది. ఈ జంట 52 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించింది. అయితే జట్టు స్కోరు 77 వద్దకు చేరుకున్న సమయంలో అబ్రార్ బౌలింగ్‌లో శాంసన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ మళ్లీ ఒత్తిడిలోకి వెళ్లింది.
Details
15వ ఓవర్లో ఊపు
శాంసన్ ఔటైన తరువాత కొంతసేపు స్కోరింగ్ మందగించింది. అయితే 15వ ఓవర్లో దూబె-తిలక్‌లు మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పారు. హారిస్ రవూఫ్ వేసిన ఆ ఓవర్లో దూబె ఒక ఫోర్, తిలక్ వరుసగా ఒక ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో ఒక్క ఓవర్లోనే 17 పరుగులు వచ్చాయి. ఆ సమయంలో భారత్ స్కోరు 100/4. 16వ ఓవర్‌లో కూడా దూబె సిక్స్ బాదాడు. ఆ ఓవర్ చివరి బంతికి తిలక్ సింగిల్ తీసి అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దీంతో భారత్‌కు 4 ఓవర్లలో 36 పరుగులు కావాల్సి వచ్చింది.
Details
ఉత్కంఠభరితంగా చివరి ఓవర్లు
17వ ఓవర్లో కేవలం 6 పరుగులే రావడంతో మ్యాచ్ మళ్లీ టెన్షన్ మోడ్‌లోకి వెళ్లింది. అయితే 18వ ఓవర్లో దూబె చివరి బంతికి సిక్స్ బాదడంతో ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి ఇక 12 బంతుల్లో 17 పరుగులు అవసరం. 19వ ఓవర్లో దూబె భారీ షాట్ ఆడగా, షహీన్ అఫ్రిది బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ పట్టాడు. ఆ ఓవర్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. దీంతో భారత్‌కు చివరి ఓవర్‌లో10 పరుగులు కావాల్సి వచ్చింది. మొదటి బంతికి 2 పరుగులు వచ్చిన తర్వాత, రెండో బంతిని తిలక్ వర్మ సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతికి రింకు సింగ్ ఫోర్ కొట్టడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.