World Athletics Championship: త్రుటిలో మెడల్ చేజారింది..భారత్‌కు ఐదో స్థానం
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023లో భాగంగా జరిగిన 4x400 పురుషుల రిలే రేసులో భారత్ త్రుటిలో మెడల్‌ను చేజార్చుకుంది. మొదటిసారిగా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో భారత అథ్లెట్లు ముహమ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్ వరియతోడి, రాజేష్ రమేస్ 2:59.92 సెకన్లలో రేసును ముగించి సత్తా చాటారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత పురుషుల జట్టు 4×400 మీటర్ల రేసును 2.59.05 సెకన్లలో పూర్తి చేసి, ఆసియా రికార్డును బద్దలు కొట్టింది. ఈ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో గత ఏడాది ఒరెగాన్‌లో 2.59.51 సెకన్ల సమయంతో ఆసియా రికార్డు జపాన్ పేరిట ఉంది.
గోల్డ్ మెడల్ ను సాధించిన యూఎస్
US అథ్లెట్లు 2:57.31 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ ను సాధించారు. ఇక ఫ్రాన్స్, యూకే, జమైకా వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. టోక్యో ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రిలే రేసులో భారత్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఏదిఏమైనా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలో భారత్ ప్రదర్శన ఎంతగానో అకట్టుకుంది.