Travis Head: భారత్ నా ఫేవరెట్ కాదు.. కానీ సిరీస్ కోసం శ్రమిస్తున్నా : ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ భారత్‌తో మ్యాచ్ అంటే తనదైన శైలిలో చెలరేగిపోతాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో స్కోరు బోర్డును పరగెత్తించి, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచులో సెంచరీ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక నవంబర్ నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. డేవిడ్ వార్నర్ రిటైర్‌మెంట్ అనంతరం, హెడ్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉస్మాన్ ఖవాజా కూడా తనతో హెడ్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
టీమిండియాతో ఆడడం కష్టంగా ఉంది
టీమిండియాతో టెస్టు సిరీస్ సందర్భంగా ట్రావిస్ హెడ్ స్పందించాడు. టీమ్ ఇండియాతో ఆడటం తన ఫేవరెట్ కాదు కానీ, వారితో ఆడటం చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఉత్తమ ఆటతీరుతోనే భారత బౌలర్ల ఎదుర్కోవచ్చని, కానీ అలసత్వానికి లోనైతే వికెట్ చేజారే ప్రమాదం ఉందన్నారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దూకుడుగా ఆడుతున్న హెడ్, రాబోయే టెస్టు సిరీస్‌లో కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ఈ టెస్టు సిరీస్ కోసం భారత బౌలర్ మహ్మద్ షమీ కూడా సిద్ధం అవుతున్నాడు. వన్డే ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న షమీ, ఇప్పుడు తన బౌలింగ్‌పై మరింత దృష్టి సారిస్తున్నాడు.