LOADING...
AUS w Vs IND w: మళ్లీ ఓడిన భారత్.. ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్!
మళ్లీ ఓడిన భారత్.. ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్!

AUS w Vs IND w: మళ్లీ ఓడిన భారత్.. ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు, వన్డే సిరీస్‌లో మాత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలై మూడు వన్డేల సిరీస్‌ను చేజార్చుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి గెలిచింది. ఆసీస్ విజయంలో జార్జియా వోల్ కీలక పాత్ర పోషించింది. ఆమె 82 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 101 పరుగులు చేసి సెంచరీ సాధించింది.

Details

జార్జియా వోల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఓపెనర్ ఫోయిబ్ లిట్చ్‌ఫీల్డ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 80 పరుగులు చేసి దూకుడుగా ఆడింది. బెత్ మూనీ 31, అన్నాబెల్ సదర్లాండ్ 10, ఆష్లే గార్డెనర్ 15 నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కాష్వీ గౌతమ్ రెండు, దీప్తి శర్మ రెండు, క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జార్జియా వోల్‌కు దక్కింది. తొలి వన్డేలోనూ ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే మార్చి 1న హోబర్ట్‌లో జరగనుంది. ఇక భారత్ ఇన్నింగ్స్ విషయానికొస్తే... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్ కౌర్

ఓపెనర్ ప్రతీకా రావల్ 52 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 54 పరుగులతో అర్ధ సెంచరీ నమోదు చేసింది. స్మృతి మంధాన 31, రిచా ఘోష్ 22, కాష్వీ గౌతమ్ 25, క్రాంతి గౌడ్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ 15, దీప్తి శర్మ 1, అమన్‌జోత్ కౌర్ 13 పరుగులతో నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డెనర్ రెండు, అన్నాబెల్ సదర్లాండ్ రెండు, అలానా కింగ్ రెండు వికెట్లు తీశారు. స్కట్, నికోలా కారీ చెరో వికెట్ సాధించారు. మొత్తానికి టీ20 సిరీస్ విజయోత్సాహాన్ని కొనసాగించాలన్న భారత మహిళా జట్టు ఆశలు వన్డేల్లో నెరవేరలేదు.

Advertisement