Team India: కేఎల్ రాహుల్‌ను జట్టులో స్పేర్‌టైర్ కంటే ఘోరంగా వాడేశారు: నవజ్యోత్ సిద్ధూ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాలో సైలెంట్ కిల్లర్ గా పేరొందిన కేఎల్ రాహుల్ (KL Rahul)ను మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పొగడ్తలతో ముంచెత్తాడు.
జట్టుకు ఏ సమయమైనా అవసరం వచ్చినా, రాహుల్ ఎప్పుడూ బాధ్యత తీసుకునేందుకు ముందుంటాడని అతను అభిప్రాయపడ్డాడు.
స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధూ మాట్లాడుతూ - "కేఎల్ రాహుల్‌ను గమనించండి... ఒక్క స్పేర్ టైర్‌ను కూడా అంత వాడరు! మీరు అతడితో వికెట్ కీపింగ్ చేయిస్తారు, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతారు, ఓ సందర్భంలో ఓపెనింగ్‌కూ పంపిస్తారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) వచ్చినప్పుడల్లా పేసర్లను ఎదుర్కొనేందుకు మూడో స్థానంలో ఆడమంటారు. మరలా ఓపెనింగ్ చేయమంటారు.
వివరాలు
రాహుల్ ఎప్పుడూ వెనుకడుగు వేయడు
వన్డే క్రికెట్‌లో ఓపెనింగ్ కొంత తేలికైన పని, కానీ టెస్ట్ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం మాత్రం భూమిపై అత్యంత క్లిష్టమైన విషయాల్లో ఒకటి. ఎక్కడైనా కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు, అక్కడ రాహుల్ బ్యాట్ పట్టాల్సిందిగా కోరతారు... అతడు ఎప్పుడూ వెనుకడుగు వేయడు. ఇది నిజమైన నిస్వార్థత. దేశం కోసం త్యాగం చేసే వారే నిజమైన మహానుభావులు. భగత్ సింగ్ కూడా ఇలానే చేశారు, అందుకే ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోయారు" అని సిద్ధూ భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.
వివరాలు
రాహుల్ 3,000 వన్డే పరుగులు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్‌లో 3,000 పరుగుల మార్కును అందుకున్నాడు.
సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై కేవలం 34 బంతుల్లో 42 పరుగులు చేసి, జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించి విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
కెరీర్ మొత్తం 84 వన్డేలు ఆడిన రాహుల్ 3,009 పరుగులు నమోదు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 88 కాగా, సగటు 48.53. ఇక అతడి ఖాతాలో ఏడు శతకాలు,18అర్ధశతకాలు ఉన్నాయి.
ఐసీసీ టోర్నీల్లో 24 మ్యాచ్‌లు ఆడి 919పరుగులు చేసిన రాహుల్, 61సగటుతో రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలు సాధించాడు.
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ కన్నా ముందుగా రావాల్సిందని భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
వివరాలు
రాహుల్ క్లాస్ ప్లేయర్: కుంబ్లే
ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే "విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యం అందించాడు.కానీ అదే స్థానంలో రాహుల్ వచ్చినా కనీసం 30 పరుగులు చేసేవాడు. అంతేకాక,అతను జట్టును విజయతీరాలకు చేర్చేలా ఆడతాడు. గతంలోనూ అతడు అదే విధంగా నిలకడగా ప్రదర్శన ఇచ్చాడు. అతడు క్లాస్ ప్లేయర్. ఈ ఇన్నింగ్స్ అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అతడి మీద చాలా ఒత్తిడి ఉంది. ఒక్క ఇన్నింగ్స్‌లో రాణించకపోయినా, అతడిపై దాడి చేస్తారు. కానీ, నేడు తన సత్తా చాటాడు" అని పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ 96 స్ట్రైక్ రేట్‌తో రెండు సందర్భాల్లో 40కి పైగా స్కోరు సాధించాడు.