Page Loader
హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం
టీమిండియా ప్లేయర్లు ధావన్, పంత్

హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2022
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను బిసీసీఐ ప్రకటించింది. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. వన్డేలకు రోహిత్ శర్మను నియమించారు. ఈ సిరీస్‌లో ధావన్, పంత్‌ను దూరం పెట్టారు. టీ20ల్లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించాలి ఆనే వాదనలను నిజం చేస్తూ మరోసారి అతడిని పొట్టి ఫార్మాట్‌కు పగ్గాలు అప్పగించారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌కు జట్లను ప్రకటించింది. విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను టీ20 జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే కోహ్లీ బ్రేక్ తీసుకోగా.. కేఎల్ రాహుల్‌ను మాత్రం కావాలనే తప్పించినట్లు తెలుస్తోంది. టీ20లకు వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యారు.

రిషబ్ పంత్

పంత్, ధావన్ కు మొండి చేయి

సెలక్టర్లు రెండు సిరీస్‌లకు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు ఇబ్బంది పడటంతో అతడిని దూరంగా ఉంచారు. పంత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టీ20లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో చేసిన ఇషాన్ కిషన్‌ను రెండు జట్లలోనూ ఎంపిక చేశారు. సంజూ శాంసన్‌ టీ20లకు అవకాశం కల్పించగా.. వన్డే జట్టుకు మాత్రం దూరంగా ఉంచారు. శ్రీలంకతో జరగనున్న ఈ రెండు సిరీస్‌ల్లోనూ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్‌కు ఎప్పటి నుంచో అతడిని దూరం పెట్టగా.. తాజాగా 50 ఓవర్ల క్రికెట్ నుంచి కూడా తప్పించారు. తొలిసారిగా యువ పేసర్లు శివమ్‌మావి, ముకేశ్‌ కుమార్‌లకు టీ20ల్లో బెర్త్‌ దక్కింది.