Page Loader
Vaibhav Suryavanshi: సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!
సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!

Vaibhav Suryavanshi: సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా అండర్-19 జట్టు,ఇంగ్లండ్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్నయూత్ వన్డే సిరీస్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అపూర్వమైన రెండు రికార్డులను సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు ఐదు వన్డేల సిరీస్‌లో భారత జట్టు మరొక విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ భారీగా సిక్సర్లు బాది అలరించాడు.వైభవ్ ఈ పోరులో బలమైన ఆటతీరు కనబర్చుతూ కేవలం 20బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు. మొత్తంగా అతడు 31బంతుల్లో 86పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సురేష్ రైనా 21 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు.

వివరాలు 

అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ 

అండర్-19 క్రికెట్ చరిత్రలో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడు అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానాన్ని అందుకున్నాడు. అతడు సాధించిన 277.41 స్ట్రైక్ రేట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అంతకు ముందు, సురేష్ రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై ఆడిన మ్యాచ్‌లో 38బంతుల్లో 90పరుగులు చేసి 236.84స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు వైభవ్ చేతిలో బద్దలైంది. అంతేకాక, అండర్-19 భారత జట్టు తరఫున అత్యంత వేగంగా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో వైభవ్ స్థానం పొందాడు. ఈ మ్యాచ్‌లో అతడు 6 ఫోర్లు, 9 సిక్సర్లు బాది అలరించాడు.

వివరాలు 

మన్‌దీప్ సింగ్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్

దీని ద్వారా ఒకే అండర్-19 మ్యాచ్‌లో తొలిసారి 9 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అతడు ఓ కొత్త మైలురాయిని అందుకున్నాడు. గతంలో మన్‌దీప్ సింగ్ 2009లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో 8 సిక్సర్లు బాదడం వరకే ఆగాడు. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ అధిగమించాడు. ఇంతకుముందు ఈ సిరీస్‌లో వైభవ్ 19 బంతుల్లో 48 పరుగులు,మరో మ్యాచ్‌లో 39 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అంటే ఈ సిరీస్ మొత్తం అతడి ఆటతీరు నిలకడగా ఉండటమే కాకుండా, ప్రతి మ్యాచ్‌లో శక్తివంతమైన ప్రదర్శన చూపించినట్టు స్పష్టమవుతోంది.

వివరాలు 

అక్కటుకున్న విహాన్ మల్హోత్రా

ఈ మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 269 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 34.3 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీతో పాటు, విహాన్ మల్హోత్రా కూడా ఆకట్టుకున్నాడు. అతడు 34 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత 6 వికెట్లు కోల్పోయిన తరువాత, ఏడో స్థానంలో వచ్చిన కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేయగా, ఆర్ఎస్ అంబరీష్ 30 బంతుల్లో 31 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశారు.