Page Loader
IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట
భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట

IND vs BAN: భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. వర్షం కారణంగా ముగిసిన తొలి రోజు ఆట

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్ - బంగ్లాదేశ్ (IND vs BAN) రెండో టెస్టు మ్యాచ్‌కు మొదటి రోజున వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించాడు. మైదానం చిత్తడిగా ఉండటంతో, మ్యాచ్ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు ఆట జరిగాక, మళ్లీ వర్షం పడింది. వర్షం తగ్గకపోవడంతో, తొలి రోజు ఆటను ముగించినట్లు ప్రకటించారు. మొదటి రోజులో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది, ప్రస్తుతం బంగ్లా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు. కాన్పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మునిగింది. దీంతో, షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్‌ను 10 గంటలకు నిర్వహించారు.

వివరాలు 

 ఆలస్యంగా రెండో సెషన్ 

ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా జట్టుకు యువ బౌలర్ ఆకాశ్ దీప్ బోల్తా కొట్టించాడు. ఓపెనర్లు షద్మాన్ ఇస్లామ్ (24) జకీర్ హసన్ (0)ను ఔట్ చేశాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ శాంటో, మొమినల్ హక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. లంచ్ విరామానికి బంగ్లా స్కోరు 74/2గా ఉంది. లంచ్ బ్రేక్‌కు వెళ్లే సమయంలో మళ్లీ వర్షం పడడంతో, పిచ్,మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పారు. వర్షం ఆగిపోయిన తర్వాత 15 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్ ప్రారంభమైంది. 29వ ఓవర్‌లో, అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ శాంటో ఎల్బీగా దొరికిపోయాడు. గంట తర్వాత మళ్లీ వర్షం రావడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది.

వివరాలు 

అశ్విన్ కొత్త రికార్డు: కుంబ్లేని దాటిన అశ్విన్ 

మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో, తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (6*) మొమినల్ హక్ (40*) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ అశ్విన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (419 వికెట్లు)పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. తాజా బంగ్లా కెప్టెన్ శాంటో వికెట్‌తో కలిపి,ఆసియా పిచ్‌లపై అశ్విన్ 420 వికెట్లు పడగొట్టాడు.