Loading...
Rohit sharma: ఇంగ్లాండ్‌తో భారత్‌కు నేడు నిర్ణయాత్మక మూడో వన్డే.. అందరి దృష్టి రోహిత్‌పైనే

Rohit sharma: ఇంగ్లాండ్‌తో భారత్‌కు నేడు నిర్ణయాత్మక మూడో వన్డే.. అందరి దృష్టి రోహిత్‌పైనే

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ పర్యటనను విజయంతో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా.. ఆదివారం జరిగే మూడో, చివరిదైన వన్డేకు సిద్ధమైంది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో మాత్రం 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే ఈ కీలక పోరులో అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది.

వివరాలు

రోహిత్‌పై ప్రత్యేక దృష్టి..

లార్డ్స్‌లో జరగనున్న ఈ వన్డే రోహిత్‌ శర్మ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ కావచ్చని, 2027 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతడికి స్థానం ఉండకపోవచ్చనే ఊహాగానాలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి.

అయితే, ఇవన్నీ వదంతులేనని, ఇది రోహిత్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కాదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేల్లోనూ రోహిత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

తొలి మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొని 11 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో వన్డేలో 47 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.

వివరాలు

బ్యాటింగ్‌లో కీలక బాధ్యత..

నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌లో అతడు ఎలా పుంజుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు శుభారంభం అందించడం భారత జట్టుకు అత్యంత కీలకం.

ముఖ్యంగా ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కొత్త బంతితో రోహిత్‌కు కఠిన పరీక్షగా మారే అవకాశముంది.

కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం.

గత మ్యాచ్‌లో 66 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మంచి లయలో కనిపిస్తున్నాడు.

మరోవైపు కేఎల్‌ రాహుల్‌ కూడా పరుగుల బాట పట్టాల్సిన అవసరం ఉంది.

అనారోగ్య కారణాలతో రెండో వన్డేకు దూరమైన రాహుల్‌.. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం జట్టుకు బలాన్నిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లాండ్‌..

బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రాపై ఉండే భారం తగ్గించే బాధ్యతను గుర్నూర్‌ బ్రార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ పంచుకోనున్నారు.

గాయంతో వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హర్ష్‌ దూబె కూడా తుది జట్టులో స్థానం కోసం పోటీలో ఉన్నాడు. టీ20 సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్న ఇంగ్లాండ్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌, సకిబ్‌ మహ్మూద్‌లతో కూడిన పేస్‌ దళం మరోసారి భారత బ్యాటర్లకు గట్టి సవాల్‌ విసరడానికి సిద్ధమవుతోంది.

బ్యాటింగ్‌లో జో రూట్‌తో పాటు జోస్‌ బట్లర్‌, హ్యారీ బ్రూక్‌ ఆ జట్టు విజయావకాశాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

ADVERTISEMENT