India vs Namibia T20 WC: నమీబియాతో ఢీ.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమ్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్‌ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అమెరికాను ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు,గురువారం ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7గంటల నుంచి ప్రారంభం కానుండగా, భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందో,ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గెలుపు సాధించినప్పటికీ, ఆ విజయం అంత ఈజీగా రాలేదు. కీలక సమయంలో టాప్ బ్యాట్స్‌మెన్ వరుసగా అవుట్ కావడంతో స్కోర్‌పై ఒత్తిడి పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని అద్భుతంగా ఆడి జట్టును మంచి స్కోర్ వరకు తీసుకెళ్లాడు.
వివరాలు
గ్రూప్ ఏలో భారత్ టాప్
ఇప్పుడు నమీబియాతో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరింత సమన్వయంతో ఆడతారని అంచనాలు ఉన్నాయి. గత రికార్డులు చూసుకుంటే భారత్‌కే పైచేయి కనిపిస్తోంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకసారి ఎదురెదురుగా తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో భారత్ రెండు పాయింట్లతో, +1.450 నెట్ రన్‌రేట్‌తో టాప్‌లో ఉంది. పాకిస్థాన్‌కీ రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్-నమీబియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను భారత్‌లో జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లలో లైవ్ స్ట్రీమింగ్‌గా చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
వివరాలు
భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్