గోల్డ్ మెడల్ గెలిచిన భారత జట్టు.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరిగిన పోటీల్లో వెన్నం జ్యోతి సురేఖ, ప్రణీత్ కౌర్, అదితి గోపీచంద్ స్వామిలతో కూడిన భారత జట్టు అద్భుతమే చేసింది. ఫలితంగా గోల్డ్ మెడల్ ను ఒడిసిపట్టింది.
మెక్సికోకు చెందిన డఫ్నే క్విన్‌టెరో, అనా సోఫా హెర్నాండెజ్, అండ్రే బెసెర్రా త్రయాన్ని ఫైనల్ మ్యాచ్ లో 235-229 తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొలంబియాను 220-216 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మొదటి రౌండ్‌లో బై టీమ్‌గా ఎంపికైన టీమిండియా, క్వార్టర్ ఫైనల్స్ లో చైనాను, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో తైపీని ఓడించింది.
DETAILS
1981నుంచి ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న భారత్
క్వాలిఫయర్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచన భారత్ ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన జట్టు, ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఈ మేరకు సరికొత్త చరిత్రను నమోదు చేశారు.
1931లో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. కానీ భారత్ మాత్రం 1981 నుంచే ఈ పోటీల్లో పాల్గొంటోంది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కు ముందు భారత్‌కు 11పతకాలు వచ్చాయి. అందులో తొమ్మిది రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. పసిడి రావడం ఇదే తొలిసారి.