LOADING...
NZ w Vs SA w: మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కివీస్.. అమెలియా కెర్ 179తో రికార్డు ఛేదన!
అమెలియా కెర్ 179తో రికార్డు ఛేదన!

NZ w Vs SA w: మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కివీస్.. అమెలియా కెర్ 179తో రికార్డు ఛేదన!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా క్రికెట్ ప్రపంచంలో అరుదైన ఘనత నమోదైంది. ఇప్పటివరకు టీమిండియా పేరిట ఉన్న అత్యధిక లక్ష్య ఛేదన రికార్డును న్యూజిలాండ్ మహిళా జట్టు బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కివీస్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదే అత్యధిక రన్ ఛేజ్‌గా నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ తమ సొంతమవుతుందని భావించిన సఫారీ జట్టుకు న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది.

వివరాలు 

అంచనాలను తలకిందులు చేసిన కివీస్ 

ఈ లక్ష్యం చూసిన తర్వాత కివీస్ విజయం దాదాపు అసాధ్యమేనని అనిపించింది. అయితే న్యూజిలాండ్ జట్టు ఆ అంచనాలను తలకిందులు చేసింది. 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 350 పరుగులు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మహిళా క్రికెట్‌లో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా కొత్త చరిత్రను రాసింది. ఇంతకుముందు భారత్ జట్టు న్యూజిలాండ్‌పై 341/5 లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డు కివీస్ చేతుల్లోకి వెళ్లింది.

వివరాలు 

చితక్కొట్టిన అమెలియా కెర్

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌కు ఆరంభం ఆశించినంతగా రాలేదు. ఓపెనర్లు త్వరగా ఔటవడంతో ఒత్తిడి పెరిగింది.అయితే స్టార్ ప్లేయర్ అమెలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేసింది. ఆమె 139బంతుల్లోనే 179*పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇందులో 23ఫోర్లు,ఒక సిక్స్ ఉన్నాయి.కెర్‌కు తోడుగా ఇసాబెల్లా గేజ్ 68పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. మధ్యలో దక్షిణాఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌లో తిరిగి పట్టు సాధించినట్టే కనిపించింది. కానీ అమెలియాకెర్ మాత్రం చివరివరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయానికి చేర్చింది. చివరకు 49.4ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న న్యూజిలాండ్ మహిళా జట్టు సంచలన విజయం సాధించింది.

Advertisement

వివరాలు 

అమెలియా కెర్‌కు'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

ఈ అద్భుత ప్రదర్శనకు గాను అమెలియా కెర్‌కు'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా మారింది. ఇక నిర్ణాయకమైన మూడో వన్డే మ్యాచ్ ఏప్రిల్ 4న జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

Advertisement