2023 శాఫ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. ప్రేక్షకులను ఆట తీరుతో మెప్పిస్తూ లక్షలాది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. సునీల్ ఛెత్రి ఆట కోసమే అభిమానులు, ప్రేక్షకులు మైదానాలకు వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ మేరకు ఇండియన్ మెన్స్ ఫుట్ బాల్ లెజెండ్ గా పేరు తెచ్చుకున్నాడు. 2 దశాబ్దాలపాటు జట్టును ముందు ఉండి నడిపిస్తున్నాడీ హిరో. తాజాగా SAFF శాఫ్ ఛాంపియన్‌షిప్ - 2023ని భారత్ గెలుచుకుంది. దీంతో తొమ్మిదోసారి టోర్నమెంట్ ను భారత జట్టు గెల్చుకున్నట్టైంది. ఈ విజయం వెనుక భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కీలక పాత్ర పోషించారు.
భారత్ తరఫున 92 గోల్స్ చేసిన సునీల్ ఛెత్రి
ఇండియన్ టీమ్ తరుపున అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అటు అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు తాను ఆడిన 140 అంతర్జాతీయ మ్యాచుల్లో 92 గోల్స్ చేశాడు. ఈ మేరకు అత్యధిక గోల్స్ చేసిన ఇండియన్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అత్యధిక గోల్స్ చేసిన ప్రస్తుత ఆటగాళ్లలో ఛెత్రి మూడో స్థానంలో నిలిచాడు. ఫుట్ బాల్ సూపర్ స్టార్లు క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ మాత్రమే ఛెత్రి కంటే ముందున్నారు. అటు క్లబ్ స్థాయిల్లో, ఇటు అంతర్జాతీయంగా మొత్తం 244 గోల్స్ సాధించడం గమనార్హం.
పాక్ పైనే తొలి అంతర్జాతీయ గోల్
2002లో మోహున్ భగవాన్ తో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా ఛెత్రి అరంగేట్రం చేశారు. 2005లో పాక్ పై ఆడిన మ్యాచ్ లో అంతర్జాతీయంగా తొలి గోల్ సాధించాడు. 2011లో దిల్లీలో జరిగిన శాఫ్ ఛాంపియన్ షిప్ లో 7 గోల్స్ కొట్టి జట్టుకు విజయం చేకూర్చారు.ఇండియన్ ఫుట్ బాల్ లెజెండ్ ఆటగాడు విజయన్ పేరిట ఉన్న 6 గోల్స్ రికార్డును ఈ మ్యాచ్ తోనే ఛెత్రి తిరగరాశారు. 2012లో పోర్చుగల్ క్లబ్ స్పోర్టింగ్ సీపీ రిజర్వ్ టీమ్ తరఫునా ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు దేశవాలీలోనూ తూర్పు బెంగాల్ (2008-2009), డెంపో (2009 -10), ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా ముంబై సిటీ ఎఫ్సీ (2017-16), బెంగళూరు ఎఫ్సీ తరఫున ఆడాడు.
తొమ్మిదోసారి భారత్ ను వరించిన శాఫ్ ఛాంపియన్‌షిప్
ఇదే క్రమంలో భారత ఫుట్ బాల్ జట్టుకు 2007, 2009, 2012 సంవత్సరాల్లో నెహ్రూ కప్ అందించడంలో విశేష కృషి చేశాడు. మరోవైపు 2011, 2015, 2021, 2023లో దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య ఛాంపియన్‌షిప్ (SAFF) సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. 2008లో ఏఎఫ్సీ ఛాలెంజ్ కప్ లో జట్టు తరఫున కీలక ప్రాతినిథ్యం వహించాడు. 27 ఏళ్ల ఏఎఫ్సీ ఆసియన్ కప్ కి అర్హత సాధించడంలోనూ ఈ స్టార్ ప్లేయర్ భాగస్వామ్యం ఉంది. సికింద్రాబాద్ లో పుట్టి పెరిగిన సునీల్ ఛెత్రి, ఇండియన్ ఫుట్ బాల్ కెప్టెన్ గా శాప్ 2023లో హ్యాట్రిక్ గోల్స్ తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే భారత జట్టును ఛాంపియన్ గా నిలపడం విశేషం.