LOADING...
IND vs SA: శుభ్‌మన్‌ గిల్‌.. జట్టుతోపాటుగా గువాహటి.. కానీ!: బీసీసీఐ
శుభ్‌మన్‌ గిల్‌.. జట్టుతోపాటుగా గువాహటి.. కానీ!: బీసీసీఐ

IND vs SA: శుభ్‌మన్‌ గిల్‌.. జట్టుతోపాటుగా గువాహటి.. కానీ!: బీసీసీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ కోల్‌కతా టెస్ట్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. మెడనొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా బయటకు వెళ్లిపోయాడు. ఆ మ్యాచ్‌లో అతడు కేవలం మూడు బంతులకే పరిమితమయ్యాడు. మ్యాచ్‌ ముగిసేంత వరకు అసలు మైదానంలోకే రాలేదు. గాయమైన రోజే రాత్రి అతడు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తరువాత అతడు డిశ్చార్జ్‌ అయ్యాడు. తాజాగా గిల్‌ పరిస్థితిపై బీసీసీఐ ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. చికిత్సకు అతడు సరిగా స్పందిస్తున్నాడని, జట్టుతో కలిసి గువాహటి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. అయితే రెండో టెస్ట్‌లో అతడు ఆడతాడా లేదా అన్న నిర్ణయాన్ని మరోసారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

వివరాలు 

గిల్‌ డిశ్చార్జ్‌ కావడంతో, అతడు జట్టుతో కలిసి గువాహటి వెళతాడని బీసీసీఐ ప్రకటన 

అయినప్పటికీ, సాధ్యమైనంతవరకూ గిల్‌ను రెండో టెస్ట్‌లో మళ్లీ మైదానంలోకి దింపాలని జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తోందనే సమాచారం వెలువడుతోంది. బీసీసీఐ ప్రకారం.. కోల్‌కతా టెస్ట్‌ రెండో రోజున గిల్‌ మెడ గాయం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. అందుకే అతడిని వెంటనే పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని, రాత్రంతా వైద్య బృందం అతడిని పర్యవేక్షించిందని పేర్కొంది. మరుసటి రోజు గిల్‌ డిశ్చార్జ్‌ కావడంతో, అతడు జట్టుతో కలిసి గువాహటి చేరతాడని వెల్లడించింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతడి ఆరోగ్య స్థితిని నిరంతరం గమనిస్తోంది. పరిస్థితిని బట్టి రెండో టెస్ట్‌లో పాల్గొనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

వివరాలు 

వైస్‌-కెప్టెన్‌ రిషబ్ పంత్‌ సారథ్య బాధ్యతలు

అతడు ఆడలేని పరిస్థితి వస్తే, వైస్‌-కెప్టెన్‌ రిషబ్ పంత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గిల్‌ స్థానంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరిని తీసుకుంటారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. సాయి సుదర్శన్ లేదా దేవ్‌దత్‌ పడిక్కల్‌లో ఏ ఒక్కరినైనా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే జట్టులో ఇప్పటికే ఆరుగురు లెఫ్ట్‌హ్యాండర్లు ఉండటంతో, వీరిలో ఎవరినైనా చేర్చితే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. ఇదిలా ఉండగా, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే జట్టుతో కలిశాడు.